భారత్Xఆస్ట్రేలియా టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వానేనా అని పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు క్రికెట్ కంటే ఇతర విషయాలపై చర్చ జోరుగా సాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా జనవరి 15న ప్రారంభమయ్యే నాలుగో టెస్టు జరుగుతుందో లేదోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి కారణం బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్ విధించడం ఒకటైతే.. మరొకటి క్వీన్స్‌ల్యాండ్‌లో భారత ఆటగాళ్లపై కఠిన ఆంక్షలు విధించడం. హోటల్లోనూ ఆటగాళ్లు రూమ్‌కే పరిమితం కావాలని క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. అయితే హోటల్లో నిబంధనలు సడలించాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ లేఖ రాసింది.
ఈ విషయంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ బీసీసీఐకి మద్దతుగా నిలిచాడు. 10 గంటలు మైదానంలో కలిసి ఉన్న ఆటగాళ్లు హోటల్లో కలిస్తే జరిగే అనర్థాలు ఏంటని ప్రశ్నించాడు. క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం వాళ్ల ప్రజలను మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలని భావిస్తుందో, sబీసీసీఐ కూడా టీమిండియాను అలానే రక్షించాలని ప్రయత్నిస్తోందన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నాడు. స్టాండ్స్‌కు వెళ్లిన బంతిని అభిమాని తాకినప్పుడు కలగని ఇబ్బంది.. హోటల్లో ఆటగాళ్లంతా కలిసి తిరిగితే ఎలా వస్తుందని బీసీసీఐ ప్రశ్నిస్తోందని గావాస్కర్ తెలిపాడు.