ముంబయి ఆటగాడు ప్రవీణ్ తాంబేకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. బీసీసీఐ నిబంధనలు పాటించని కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడే అవకాశం కోల్పోనున్నాడు ఈ సీనియర్ క్రికెటర్.
ఇదేనా కారణం..!
2018లో అబుదబి వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో సింథిస్ తరఫున ఆడాడు తాంబే. ఇందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుమతి తీసుకోలేదు. ఐపీఎల్, భారత జట్టు తరఫున ఆడాలనుకునే ఏ క్రికెటర్ విదేశీ లీగుల్లో పాల్గొనకూడదనేది బోర్డు నిబంధన. ఒకవేళ బయట దేశాల్లో ఆడాలనుకుంటే క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాలి. లేదంటే బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాల్సి ఉంటుంది. ఇవేమి చేయకుండా తాంబే నిబంధనలు ఉల్లంఘించాడని భారత బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడే అవకాశం కోల్పోనున్నాడు.

ఇటీవలె జరిగిన వేలంలో తాంబేను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. చివరకు కేకేఆర్(కోల్‌కతా నైట్‌రైడర్స్) జట్టు బిడ్‌కు వెళ్లింది. పోటీ లేకపోవడం వల్ల ఈ 48 ఏళ్ల ఆటగాడిని కనీస ధర రూ. 20 లక్షలకే దక్కించుకుంది. ఈ వేలంలో పాల్గొన్న పెద్ద వయస్కుడిగా పేరు తెచ్చుకున్నాడు తాంబే.
ఐపీఎల్‌లో గతంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు తాంబే. 2013లో భారత లీగ్‌లో అరంగేట్రం చేసిన ఈ లెగ్ స్పిన్నర్.. మొత్తంగా 33 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాడు. 2016లో తన ఐపీఎల్ చివరి మ్యాచ్ ఆడాడు.
అభిమానులు ఫైర్...
తాంబేపై వేటు పడే అంశం తెలియగానే కోల్‌కతా జట్టు అభిమానులు ఐపీఎల్ యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్‌లో ఆడేందుకు దాదాపు 970 మంది దరఖాస్తు చేసుకోగా.. 338 మందికి వేలంలో పాల్గొనేందుకు అవకాశమిచ్చింది. అయితే వీళ్లలో నుంచి 62 మందిని ప్రాంఛైజీలు కొనుక్కున్నాయి. వేలం ముందే తుది జాబితాలో పేరు తప్పించని యాజమాన్యం.. మరి ఇప్పుడు నిబంధనల పేరుతో ఎందుకు అడ్డు చెబుతోందని కోల్‌కతా జట్టు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.