భారత క్రికెట్లో నూతన అధ్యాయం ఐపీఎల్. వినూత్న ఆలోచన, పొట్టి ఫార్మాట్లో తీసుకొచ్చిన ఈ టోర్నీ సూపర్ హిట్టుగా నిలిచింది. అలాంటి ఈ లీగ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. టోర్నీ ఆరంభంలో ఒక మ్యాచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి 'ఆల్ స్టార్' మ్యాచ్‌గా పేరు పెడుతున్నారు. ఇది టోర్నీకి మూడు రోజుల ముందు జరగనుంది.
నాలుగేసి జట్లుగా...
ప్రస్తుతం ఐపీఎల్లో ఎనిమిది జట్లు ఉన్నాయి. వాటిలో ఉత్తర, తూర్పు రాష్ట్రాలు ఒకవైపు, దక్షిణ, పడమర రాష్ట్రాల జట్లు మరో వైపు కలిసి ఆడనున్నాయి. ఫలితంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక బృందంగా ఏర్పడనున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ ప్రత్యర్థి జట్టుగా ఉండనున్నాయి. ఇదే జరిగితే కోహ్లీ, ధోనీ, రోహిత్ ఒకే జట్టులో టీమిండియా జెర్సీ లేకుండా ఆడనున్నారు. ఇంకా తేదీలు, వేదిక ఖరారు కావాల్సి ఉంది.
ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రారంభాన్ని 8 గంటలకు కాకుండా అరగంట ముందుగా 7.30 గంటలకే ప్రారంభించాలని కోరినా తగ్గేది లేదని నిర్వాహకులు వెల్లడించారు. ఐపీఎల్ ఫైనల్ ముంబయిలోని వాంఖడేలో జరగనుంది.