మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న ఐపీఎల్‌కు కరోనా(కోవిడ్-19) ప్రభావం గట్టిగానే తగిలింది. ఇందులో ఆడే విదేశీ ఆటగాళ్లకు వచ్చే నెల 15 వరకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ కారణంతో మెగా ఈవెంట్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల, భారత ప్రభుత్వం విదేశీ వీసాలపై నిబంధనల్ని కఠినతరం చేసింది. దౌత్య సంబంధిత, వర్క్ వీసాలకు మాత్రమే అనుమతిస్తోంది. దీంతో వచ్చే నెల 15 వరకు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో కనిపించే పరిస్థితి లేదని గురువారం బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు.
ఈ లీగ్‌లో ఆడే విదేశీ క్రికెటర్లకు వాణిజ్య సంబంధిత వీసాలు జారీ చేస్తారు. ఐపీఎల్ నిర్వహణపై గవర్నింగ్ కౌన్సిల్.. ముంబయిలో ఈ శనివారం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.
భారత్‌లో ఇప్పటికే 60 కరోనా కేసులు నమోదవ్వగా.. ప్రపంచవ్యాప్తంగా 4 వేల మందికి పైగా మృతిచెందారు. ఒకవేళ ఐపీఎల్ వాయిదా వేసినా, ఏప్రిల్, మే తర్వాత కీలక విదేశీ ఆటగాళ్లు భారత్‌కు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇతర జట్లన్నింటికీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను నిర్వహించాలంటే అభిమనులను స్టేడియంలోకి అనుమతించకుండా ఆడించడమే ఉత్తమ మార్గంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.
మరోవైపు పుణెలో కరోనా కేసులు నమోదవ్వడం వల్ల అక్కడ జరుగుతున్న 'రోడ్డు భద్రత టీ20' సిరీస్‌పై ఆంక్షలు విధించారు. గురువారం నుంచి ప్రేక్షకులు లేకుండానే ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.