ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను యూఏఈకి తరలించడంలో ఇబ్బందేమీ ఉండదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. అక్కడి వేడి వాతావరణాన్ని తట్టుకోవడమే ఆటగాళ్లకు సవాలని తెలిపాడు. ఆర్సీబీ, చెన్నై, పంజాబ్ వంటి జట్లు అక్కడ రాణించే అవకాశం ఉందని అంచనా వేశాడు. అయితే ఐదు వారాల్లో లీగ్ ఫేస్‌ను ముగించడానికి రోజుకు రెండు మ్యాచ్‌లు ఆడితే మాత్రం ఆటగాళ్లు డీహైడ్రేట్ అవుతారని అభిప్రాయపడ్డాడు.
"యూఏఈలో సమస్యలేమీ ఉండకపోవచ్చు. ఆటగాళ్లు మాత్రం వేడిని తట్టుకోవాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే అక్కడ ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ. ప్రస్తుతం వాతావరణం బాగుంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 7 వరకు ఆరు వారాలపాటు టోర్నీ అంటున్నారు. ఇందులో ఐదు వారాలపాటు లీగ్ ఫేస్, వారంపాటు ప్లే ఆఫ్స్ జరుగనున్నాయి. మరీ ఐదు వారాల్లోనే లీగ్ఫేస్ ముగించాలనేది ఇక్కడ మరో సమస్య. ఇందుకోసం ఎక్కువ డబుల్ హెడర్స్ (రెండు మ్యాచులు) నిర్వహించక తప్పదు. అలాంటప్పుడు సాయంత్రం మ్యాచులు మొదలైతే ఆటగాళ్లు త్వరగా డీహైడ్రేట్ అవుతారు"
- ఆకాశ్ చోప్రా, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్.
ఆర్సీబీకి కలిసొస్తది!
బ్యాటింగ్ పరంగా యూఏఈలో ప్రభావమేమీ ఉండదని అంచనా వేశాడు చోప్రా. దీనివల్ల కొన్ని జట్లు అక్కడ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆస్కారం ఉందన్నాడు. మైదానాలు పెద్దవి కావడం వల్ల ఆర్సీబీ వంటి జట్ల బౌలింగ్ లోపాలు బయట పడకపోవచ్చని తెలిపాడు. అలాంటప్పుడు పటిష్ఠ బ్యాటింగ్ లైనప్ ఉన్న కోహ్లీసేన మెరుగైన ప్రదర్శన చేయొచ్చన్నాడు. నాణ్యమైన స్పిన్నర్లున్న చెన్నై సూపర్‌కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కూ అక్కడి మైదానాలు నప్పుతాయన్నాడు.
ఇది చూడండి : జాతీయ డోపింగ్ ప్రయోగశాలపై మరో ఆర్నెళ్లు వేటు..