పెళ్లి వయసొచ్చిన కొడుకు ఉన్న దంపతులు మళ్లీ ఓ పాపాయికి జన్మనిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'బదాయి హో'. ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్మించిన జంగిల్ పిక్చర్స్ 'బదాయి దో' పేరుతో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో రాజ్‌కుమార్ రావ్, భూమి పెడ్నేకర్ జంటగా నటించనున్నారు. హర్షవర్ధన్ కులకర్ణి దీనికి దర్శకత్వం వహించనున్నారు.
ఓ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒకేఒక్క మగ పోలీస్ పాత్రలో రాజ్‌కుమార్ రావ్ పాత్ర ఉండబోతోంది. పీఈటీ టీచర్‌గా భూమి పెడ్నేకర్ నటించనున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.