ఇళయరాజా స్ఫూర్తిని తీసుకుని, కొన్ని సినిమాల్లో ఆయనే సంగీతం అందించారా అని సందిగ్ధంలో పడేసే రీతిలో పాటలకు బాణీలు సమకూర్చారు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి. టాలీవుడ్‌లోని ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆయన చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాలకు సంగీతం అందించారు. కొన్ని పాటలు కూడా పాడారు. ఈయన అసలు పేరు చక్రధర్. ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
తనువంతా తెలం'గానం'
మహబూబాబాద్ జిల్లాలోని కంబలపల్లిలో చక్రి జన్మించారు. ఈయనకు సోదరుడు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. చక్రి సోదరుడు కూడా సంగీత దర్శకుడే. సోదరి పేరు కృష్ణప్రియ. ఆమె జిల్లా పరిషత్ హైస్కూల్ చెల్పూర్, హుజురాబాద్, కరీంనగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారు.
ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి సినిమాల్లోకి..
మొదట్లో ప్రైవేటు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో కెరీర్‌ను మొదలుపెట్టి నెమ్మదిగా సినీ సంగీతాన్ని ఆవహింపచేసుకున్నారు చక్రి. పూరీ జగన్నాథ్ తీసిన 'బాచి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. దాదాపు 85 సినిమాలకు గీతాలను సమకూర్చారు. ప్రతిష్ఠాత్మకమైన ఫిలింఫేర్, నంది పురస్కారాలనూ గెలుచుకున్నారు. ఎంతోమంది ఔత్సాహిక గీత రచయితలను, గాయనీగాయకులను, టెక్నిషియన్లను టాలీవుడికు పరిచయం చేశారు.

పూరీ, రవితేజలతోనే ఎక్కువ..
'బాచి' సినిమాతో పరిచయమైన చక్రి... ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌లతో ఎక్కువసార్లు పనిచేశారు. రవితేజతో ఎనిమిది సినిమాలకు.. పూరీ జగన్నాథ్‌తో పది సినిమాలు చేశారు. సంక్రాంతి సీజన్ జనవరి నెలలో చక్రికి ఎక్కువ హిట్లు వచ్చాయని విశ్లేషకులు అంటారు. 'దేవదాసు', 'దేశముదురు', 'కృష్ణ', 'మస్కా' సినిమాలు సంక్రాంతికి విడుదలై ఈయనకు ఎంతోమంచి పేరు తెచ్చిపెట్టాయి. ట
వ్యక్తిగత జీవితం
చక్రి భార్య పేరు శ్రావణి. వివాహం తర్వాత జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఓ కాంప్లెక్స్‌లో నివాసముండేవారు. శ్రావణి కొత్తగూడెం ప్రాంతానికి చెందినవారు.
పురస్కారాలు
'సత్యం' సినిమాకు ఉత్తమ గాయకుడిగా ఓ ఫిలింఫేర్ పురస్కారాన్ని, 'సింహ' చిత్రానికి ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా నంది అవార్డును అందుకున్నారు.

చక్రి సంగీత 'చక్రం'
'బాచి', 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఆడుతూ పాడుతూ', 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు', 'ఇడియట్', 'అమ్మాయిలు అబ్బాయిలు', 'ధనలక్ష్మి ఐ లవ్ యూ', 'కబడ్డీ కబడ్డీ', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'డ్రీమ్స్', 'ఒక రాజు ఒక రాణి', 'దొంగ రాముడు అండ్ పార్టీ', 'శివమణి', 'సత్యం', 'తొలి చూపులోనే', 'ఆంధ్రావాలా', 'పెదబాబు', '143', 'అందరూ దొంగలే దొరికితే', 'కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను', 'ధన 51', 'సోగ్గాడు', 'చక్రం', 'భగీరథ', 'పార్టీ', 'చుక్కల్లో చంద్రుడు', 'దేవదాసు', 'అసాధ్యుడు', 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా', 'సత్యభామ', 'దేశముదురు', 'ఢీ', 'టక్కరి', 'కాశీపట్నం చూడరా బాబు', 'కృష్ణ', 'నగరం', 'విక్టరీ', 'నేనింతే', 'మస్కా', 'గోపి గోపిక గోదావరి', 'రాజు మహారాజు', 'సింహ', 'గోలీమార్', 'ఆకాశ రామన్న', 'బావ', 'సరదాగా కాసేపు', 'వాంటెడ్', 'జై బోలో తెలంగాణ', 'నా ఇష్టం', 'శ్రీమన్నారాయణ', 'దేవరాయ', 'లడ్డు బాబు', 'రేయ్', 'యుద్ధం', 'ఎర్ర బస్సు', 'టామీ', 'వెన్నల్లో హాయ్ హాయ్' తదితర సినిమాలకు చేశారు.
కృష్ణవంశీ దర్శకత్వంలోని 'చక్రం' సినిమాలో చక్రి పాడిన జగమంత కుటుంబం నాది పాటకు మంచి ఆదరణ లభించింది. ఈ పాటను సిరివెన్నెల రాశారు.
చక్రి మరణం
2014 డిసెంబర్ 15 ఉదయం, తన భార్య శ్రావణి ఎన్నిసార్లు లేపినా చక్రి నిద్ర లేవలేదు. దాంతో, దగ్గరలోని ఆస్పత్రికి ఆయనను తీసుకెళ్లారు. ఉదయం సుమారు 7:45 ప్రాంతంలో చక్రి చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఊబకాయం సమస్యతో చక్రి తీవ్రంగా బాధపడ్డారు. బహుశా గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చక్రి అకాల మరణం తెలుగు సినిమా పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది.