తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ పీఆర్వో బీఏ రాజు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన పెద్ద కుమారుడు అరుణ్ అంతిమసంస్కారాలు నిర్వహించారు. ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్.. అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించారు.
పరిమిత సంఖ్యలో సినీప్రముఖులు, పాత్రికేయులు హాజరై బీఏ రాజుకు తుదివీడ్కోలు పలికారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. మూడు రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. బీఏ రాజు మరణం పట్ల యావత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నటీనటులు, దర్శక నిర్మాతలు.. సినీ పరిశ్రమ ఓ మంచి వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన బీఏ రాజు.. 'లవ్లీ', 'వైశాఖం' వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. సూపర్ హిట్ అనే మ్యాగజైన్‌ను నిర్వహిస్తున్నారు. పలువురు అగ్ర కథానాయకులకు వ్యక్తిగత పీఆర్వోగా వ్యవహరించారు.