విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో... క్రీడా కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రానికి 'ఫైటర్' అనే పేరు ఖరారు చేశారు. విజయ్ సరసన బాలీవుడ్ చిన్నది అనన్య పాండే నటిస్తోంది. ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. అయితే.. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి అనన్యను పొగడ్తలతో ముంచెత్తాడు విజయ్.
'అనన్య చాలా మంచి అమ్మాయి. ఆమెను తెలుగు సినిమాల్లో చూడాలని దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమాలో ఆమె బాగా నటించింది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొస్తుందని గట్టిగా నమ్ముతున్నా' అని విజయ్ అభిప్రాయ పడ్డాడు.
కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాల్సి వచ్చింది. క్లైమాక్స్ సీన్ మాత్రమే మిగిలిపోయినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని పలు భాషాల్లో విడుదలకానుంది. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో 'ఫైటర్'పై భారీ అంచనాలే ఉన్నాయి.