అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' ఘన విజయం సాధించింది. ఆ సినిమా వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం.. సంబరాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇలా చిత్రబృందం మొత్తం పాల్గొని సందడి చేసింది.

ప్రతి క్షణం ఎంజాయ్ చేశా..
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే.. 2020 ఎంతో మందికి చేదుజ్ఞాపకం కానీ.. నాకు మాత్రం తీపి జ్ఞాపకాన్నిచ్చిన ఏడాది. ఈ సినిమా వల్ల లాక్‌డౌన్‌లోనూ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. నాకు మంచి మైలురాయి రావడానికి 20 సినిమాలు పట్టింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ధన్యావాదాలు. ఈ సినిమా ఎంత పెద్దవిజయం సాధించినా అందరికంటే మంచి పేరు వచ్చింది నాకే. తమన్ ఒక్క పాట కాదు.. అల్బమ్ మొత్తం అద్భుతంగా ఇచ్చారు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వింటున్నా. త్రివిక్రమ్ కేవలం నాకు డైరెక్టర్ మాత్రమే కాదు.. పెద్దన్నలాంటి వారు. సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని చెప్పారు.

అదరగొట్టారు..
డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. "రెండు సంవత్సరాల క్రితం నేను, బన్నీ బ్లాక్ కాఫీ తాగుతూ.. సినిమా చేయాలనుకున్నాం. అలా మొదలైన ఈ సినిమా ప్రయాణం ఇప్పటివరకూ వచ్చింది. ఈ సినిమాకు బన్నీ ఎంతలా కష్టపడ్డాడో మాటల్లో చెప్పలేను. ఒక నటుడిలా కాకుండా.. టెక్నీషియన్‌లా మాతోపాటే పనిచేశారాయన. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతం అద్భుతం. 'సామజవరగమన'.. 'రాములో రాముల'.. ఒక వండర్. సినిమాను థియేటర్‌లో ప్రేక్షకులు ఎంతలా ఆస్వాదించారో.. మేం షూటింగ్‌ను అంతే ఎంజాయ్ చేశాం" అని ఆయన ముగించారు.

త్రివిక్రమ్ పెన్ను వాడలేదు..
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. " 'అల..' చిత్రం విజయవంతం కావడానికి ముఖ్యకారణం త్రివిక్రమ్‌గారు. ఈ సినిమాకు ఆయన పెన్ను వాడలేదు.. ఎక్కువగా పెన్సిల్ వాడారు. అంటే రాస్తూరాస్తూ.. ఉండిపోయారు. అంతలా కష్టపడ్డారాయన. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. బన్నీ గురించి చెప్పాలంటే.. నాకు కెరీర్‌లో ఆయనతో చేసిన 'రేసు గుర్రం' ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాకు నేను చేసిన ఆల్బమ్ కరోనా సమయంలో ఎంతో అలరించింది. నేను నా కొత్త సినిమా ఫంక్షన్లకు కూడా వెళ్లడం లేదు. కానీ.. ఈ కార్యక్రమానికి వచ్చానంటే ఈ సినిమా నాకెంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. నా ప్రేమ.. నా ఎమోషన్ అంతా సంగీతమే" అని అంటూ తమన్ భావోద్వేగానికి గురయ్యారు.

ఇదీ చూడండి: 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ మరో రికార్డు