'బాహుబలి' హీరో ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ముంబయిలో ప్రారంభమైంది. అక్కడ కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ రెండో దశతో వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంగీత దర్శకుడిగా పనిచేసేది ఎవరనేది ఇప్పటి వరకు చిత్రబృందం చెప్పలేదు.
తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకులు సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు ఈ సినిమాకి పనిచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరు గతంలో ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రంలోని 'సైకో సైయాన్' అనే పాటకి సంగీత స్వరాలు అందించారు. ఇంకా 'ఏక్ ప్రేమ్ కథ', 'కబీర్ సింగ్', 'పతి పత్ని ఔర్ వో', 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్' వంటి బాలీవుడ్ చిత్రాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం షాహిద్ కపూర్-మృణాల్ ఠాకూర్ నటిస్తున్న 'జెర్సీ' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
'ఆదిపురుష్'లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. సినిమాకు కార్తిక్ పళని ఛాయగ్రాహకుడిగా పనిచేస్తుండగా ఎడిటర్లుగా అపూర్వ మోతివాలే, ఆశిష్ మాత్రేలు వ్యవహరిస్తున్నారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న తెరపైకి రానుంది.