ETV Bharat / opinion

'రాజకీయ ప్రజాస్వామ్యం అర్థం వేరు'

author img

By

Published : Oct 11, 2021, 8:20 AM IST

రాజకీయ ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాకుల ప్రజాస్వామ్యం (మెజారిటేరియన్‌ ప్రజాస్వామ్యం) అని భావించకూడదన్నారు ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్‌ అజయ్‌ స్కారియా. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం చుట్టూ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం దీనికి భిన్నంగా జరుగుతోందని.. ఇది ప్రమాదకరమన్నారు. ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరెన్నో కీలక విషయాలు వెల్లడించారు.

Political democracy
గాంధీ మార్గం నిత్యనూతనం

భారతదేశం దాస్యశృంఖలాలను తెంచుకొని ఏడున్నర దశాబ్దాలు అవుతున్న సందర్భంగా... స్వాతంత్య్రం ద్వారా మహాత్మా గాంధీ ఆశించిందేమిటి, జరిగిందేమిటి అనే అంశాలపై పలు విషయాలను విపులీకరించారు చరిత్రకారులు ప్రొఫెసర్‌ అజయ్‌ స్కారియా. గుజరాత్‌కు చెందిన అజయ్‌ - కేంబ్రిడ్జ్‌లో పరిశోధన అనంతరం అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. 'గాంధీ పాలిటిక్స్‌ - లిబరలిజం, ద స్ట్రేంజ్‌ వయొలెన్స్‌ ఆఫ్‌ సత్యాగ్రహ' తదితర పుస్తకాలతో పాటు అనేక పరిశోధనా పత్రాలను వెలువరించారు. 'రాజకీయ ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాకుల బల ప్రదర్శన కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం చుట్టూ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలి. ప్రస్తుతం దీనికి భిన్నంగా జరుగుతోంది. అది చాలా ప్రమాదకరం' అంటున్న ఆయన 'ఈనాడు' ప్రతినిధి ఎం.ఎల్‌.నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో అంశాలను వివరించారు.

స్వాతంత్య్రం వచ్చి 74 వసంతాలు గడిచాయి. దేశం ఏ దిశగా పయనిస్తోందని భావిస్తున్నారు?

స్వాతంత్య్రోద్యమం ఏం ఆశించిందో అది జరగలేదు. ఇక్కడ మూడు ప్రధాన అంశాలను పరిశీలించాలి. మొదటిది గాంధీ దార్శనికత... రాజ్యంతోపాటు, దానికి బయట వ్యవస్థలను, సామాజిక సంస్థలను బలంగా నిర్మించడం. ఇది జరగలేదు. దీనికి కారణం కుల వ్యతిరేక ఉద్యమం, వామపక్షాలు నిర్వహించిన రైతు, కార్మిక పోరాటాలు ఇందులో భాగం కాకపోవడమే. గాంధేయ ఉద్యమం స్వరూపం మారి ఆశ్రమాలు, ఇతర కార్యక్రమాల ద్వారా దళితులను, ఆదివాసులను పైకి తెచ్చేదిలా రూపొందింది. ఇది ప్రజలను కొంతవరకే సమీకరించగలిగింది. రెండోది నెహ్రూ-పటేల్‌ దార్శనికత... స్వాతంత్య్రం వచ్చిన తరవాత వారిద్దరూ రెండు రకాల నైతికతలపై దృష్టి సారించారు. ఒకవైపు ప్రజలకు సమాన హక్కులు కల్పించే రాజకీయ ప్రజాస్వామ్యం, మరోవైపు అభివృద్ధి కేంద్రంగా పని చేయడం, రాజ్యాన్ని వినియోగించుకొని పేదరికాన్ని నిర్మూలించడం. తరవాత ఇదీ బలహీనపడింది. మొదటిది జరిగి ఉంటే భారత ప్రజాస్వామ్యం ఇలా ఉండేది కాదు. నెహ్రూ-పటేల్‌ల మధ్య అనేక విభేదాలు ఉన్నా, వారి మార్గదర్శకాలు అన్ని వర్గాల ప్రజల సమానత్వానికి సంబంధించినవి. ఈ రెండు దార్శనికతలూ ఒకదానికొకటి ఎలా సహాయపడతాయో గాంధీ గుర్తించారు. అందుకనే కాంగ్రెస్‌లోని ముఖ్యులు 'పార్లమెంటరీ స్వరాజ్‌'ను కోరుకుంటే, తాను 'నిజమైన స్వరాజ్‌'ను కోరుకున్నానని తరచూ అనేవారు. ప్రస్తుతం ఆధిపత్యం వహిస్తున్న అంశం మూడవది... ఇది మొదటి రెండింటిలో ఉన్న లోపాలతో కూడుకొన్నది. ఆనాటి 'హిందూ మహాసభ', నేటి 'హిందుత్వం' దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

Political democracy
చరిత్రకారులు ప్రొఫెసర్‌ అజయ్‌ స్కారియా

గాంధీ గురించి కొత్త తరం నేర్చుకోవాల్సిందేమిటి?

రాజకీయ ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాకుల ప్రజాస్వామ్యం (మెజారిటేరియన్‌ ప్రజాస్వామ్యం) అని భావించకూడదు. ప్రస్తుతం 'హిందుత్వ'తో ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇది సరైన ప్రజాస్వామ్యం కాదు. హిందుత్వ అనేది జాత్యహంకార ఆధిపత్యానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అమెరికాలో జిమ్‌ క్రో కాలంలోనూ ఇలాగే జరిగింది. నిజానికి ఇలాంటివాటికి భిన్నంగా, తీవ్రమైన రాజకీయ విభేదాలున్నా గాంధీ, అంబేడ్కర్‌, నెహ్రూ, పటేల్‌ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ప్రయత్నించారు. రాజకీయ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం చుట్టూ నిర్మితమైంది. అందుకే నాటి నినాదాలు అందరూ సమానమనే అభిప్రాయాన్ని కల్పించాయి.

ప్రస్తుత ప్రపంచంలో గాంధీకి నిజమైన వారసులెవరు? గాంధీ వారసత్వాన్ని ఎలా బలోపేతం చేయగలం?

అహింస ద్వారా మార్పును సాధించాలనుకొనేవారు, రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవించగలిగేవారే నిజమైన గాంధేయవాదులు. భారతదేశంలో గాంధీ చూపిన మార్గంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉదాహరణకు నర్మదా బచావో ఆందోళన్‌ పూర్తిగా ఆ దిశగానే సాగింది. దీంతోపాటు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఎంతోమంది గాంధీ చిత్రాలతో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నిరసనకారులు జాత్యహంకార, నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గాంధీ చూపిన అహింసాయుత పోరాటమార్గాన్ని ఎన్నుకొంటున్నారు. ఈ మార్గంలో రాజకీయ సమీకరణలు చేసేవారితోపాటు సామాజికంగా, ఆర్థికంగా అణగారిన, అల్పసంఖ్యాకవర్గాల వారి సాధికారత కోసం పని చేయడం సైతం గాంధీ వారసత్వాన్ని కొనసాగించడమే. మనం మరచిపోకూడని అంశం ఏమిటంటే, గాంధీ తన జీవిత కాలంలో ఇలాంటి నిర్దిష్టమైన పనికి రాజకీయ ఆందోళనల కంటే ఎక్కువ సమయం కేటాయించారు. సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జరిగే ప్రయత్నం చాలా త్వరగా రాజకీయ మార్పునకు దారి తీస్తుంది.

భారత సమాజం సహజంగానే సహనం కలిగింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పరిస్థితిలో మార్పు రావడానికి కారణమేమిటి?

సమాజం గురించి అర్థం చేసుకోవడానికి 'సహనం' అనే పదం చాలా ముఖ్యం. అనేక సమూహాలు పరస్పరం సహనంతో ఉండేవి. అంటే సహించే సమూహాన్ని సమానంగా చూసినట్లు కాదు. ఉదాహరణకు ఆధిపత్య కులాలు కింది కులాల పట్ల సహనంతో ఉన్నాయి. ఎంతవరకు అంటే... వారు నిర్ణయించినట్లుగా, చెప్పినట్లుగా ఉన్నంతవరకే! వివిధ మతాలకు చెందిన వారు ఒకరికొకరు సహనంతో ఉండేవారు. కొన్ని సందర్భాల్లో కలిసిపోయేవారు కూడా. ఇందులోనూ ఎవరి పరిధి వారిదే. మతాల మధ్య, స్త్రీ-పురుషుల మధ్య నిర్ణయించిన ప్రొటోకాల్‌ పరిమితుల్లోనే ఉండేది. అసమానతలను ఆమోదించినంతవరకు ఈ సహనం ఉండేది. 20వ శతాబ్దం మధ్యలోనూ జాతీయవాదులు గతంలోని సహనం, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తెచ్చేవారు. ప్రజాస్వామిక లౌకికవాదంలో ఉన్న వైరుధ్యాలూ మితవాదం వైపు మళ్ళేందుకు కారణమయ్యాయి.

ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో గాంధీ అహింసా సిద్ధాంతం, సహనం గురించి బైడెన్‌ ప్రస్తావించారు. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు?

జాత్యహంకారం కొనసాగుతున్న, సామ్రాజ్యవాద చరిత్ర, పోకడలు ఉన్న దేశానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి... గాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడటమేమిటనే ఉద్దేశంతో దాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేయవచ్చు. బైడెన్‌ నాయకత్వం వహిస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ ఆధిపత్య జాతికి ప్రతినిధి. భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలం- గతంలో ట్రంప్‌ ఆధ్వర్యంలో అమెరికాలో ఉన్న ఆధిపత్య జాత్యహంకారం లాంటిది. ఇలాంటి ఆధిపత్య దుర్విచక్షణ 1990వ దశకంలో భారత్‌లో కాంగ్రెస్‌ పాలనలోనూ ఉండేది. బైడెన్‌ మర్యాదపూర్వకంగా గాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడటాన్ని వాటి పట్ల అంగీకారంతో అనుకోకూడదు. బైడెన్‌, ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలాల గురించి, వీటి మధ్య ఉన్న విభేదాల గురించి ప్రస్తావించడమనే అనుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే ఈ రెండురకాల జాత్యహంకారాల మధ్య అనుబంధం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం అనేది ఆలోచనపరంగా సరైంది కాదు. ఒకవేళ తప్పదంటే మెజారిటేరియన్‌ రేసిజాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇది కనీసం అందరం సమానం అనైనా చెబుతుంది. 1990వ దశకంలో కాంగ్రెస్‌ పాలనలో ఉన్నట్లు అప్పుడప్పుడు వ్యవస్థాగతమైన సమానత్వమూ ఉంటుంది. కాబట్టి మోదీ ముందు గాంధీ గురించి బైడెన్‌ మాట్లాడటం అంటే, ఇదేదో గాంధీ సిద్ధాంతాల పట్ల ధ్రువీకరణ అని కాకుండా రెండు రకాల జాత్యహంకారాల మధ్య ఉన్న తేడా గురించి ప్రస్తావించడంగానే భావించాలి.

సమానత్వం అంటే ఏమిటి?

పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. నయా ఉదారవాదం అభివృద్ధి చెందుతున్న క్రమంలో రాజకీయ సమానత్వ ప్రక్రియను తీసి పక్కనపడేశారు. దాని స్థానంలో జాతి, మత ప్రాతిపదికన సమానత్వం ఉండాలనే ప్రతిపాదనను ఇటీవల ముందుకు తెచ్చారు. ఇది చాలామందిని ఆకర్షించగలిగింది. ఈ భావజాలాన్ని, ఇలాంటి రాజకీయ శక్తులను మాటలు, రాతల ద్వారా ఎదుర్కోవడం కష్టం. అంబేడ్కర్‌ దీని గురించి చాలా బాగా చెప్పారు. రాజ్యాంగం రాజకీయ సమానత్వాన్ని ముందుకు తెచ్చింది కానీ, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని కాదు. సామాజిక, ఆర్థిక సమానత్వం లేకపోతే రాజకీయ సమానత్వం సులభంగా అంతరిస్తుంది. అసమానతలు పెరిగిన ఫలితంగా రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం డొల్లగా మారింది. ఆర్థిక, సాంఘిక, రాజకీయ హక్కుల కోసం పెద్దయెత్తున సమీకరణ జరగాలి.

ఇదీ చూడండి: 'తొందరగా బలగాలను ఉపసంహరించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.