సమతౌల్యం కోల్పోతున్న పర్యావరణం ప్రపంచదేశాలకు పెను సవాలు విసరుతోంది. ఎక్కడికక్కడ అభివృద్ధి పేరిట వనరుల వినియోగం మితిమీరిపోయింది. జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, నగరాల విస్తరణ, అడవుల క్షీణతకు తోడు... సహజ వనరుల వినియోగంపై అనేక దేశాల్లో నియంత్రణ కొరవడింది. దీంతో అరుదైన, సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు వేగంగా వినాశనానికి గురవుతున్నాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వల్ల స్వచ్ఛమైన గాలి, నీరు కలుషితమవుతున్నాయి. అడవుల అంతర్ధానంవల్ల జీవవైవిధ్యానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ ప్రభావంతో వన్యప్రాణులు, ఇతర జీవజాతుల ఆవాసాలు కుంచించుకుపోయి- కొవిడ్ వంటి సాంక్రామిక వ్యాధులు మానవాళికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి, దశాబ్దాలుగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రకృతి వ్యవస్థల పునరుద్ధరణ ఒక్కటే మానవాళి ముందున్న మార్గం. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు రానున్న దశాబ్ద కాలంలో (2021-2031) ప్రకృతి వ్యవస్థల రక్షణకోసం ప్రపంచ దేశాలు కచ్చితమైన కార్యాచరణకు నడుంకట్టాలని సమితి పిలుపిస్తోంది.
మాటలకు చేతలకు పొంతనేదీ?
దశాబ్దాలుగా వివిధ దేశాల ప్రభుత్వాలు- అటవీ వనాలు, తీర వ్యవస్థల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటించుకొంటున్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ ద్వారా ప్రకృతి వ్యవస్థలను సమతౌల్యం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని హామీలు గుప్పిస్తున్నాయి. వివిధ దేశాధినేతలు ప్రపంచ వేదికల మీద ఇస్తున్న భరోసాకు... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు మధ్య పొంతన ఉండటం లేదు. కొన్ని దశాబ్దాలుగా భూగోళంపై ప్రకృతి వ్యవస్థలను విధ్వంసానికి గురిచేస్తూ వనరుల దోపిడి కొనసాగుతోంది. ప్రపంచ ఆహార సంస్థ ఇటీవలి ప్రపంచ అటవీ వనరుల స్థితిగతుల నివేదిక ప్రకారం గడచిన ముప్ఫై ఏళ్లలో 17 కోట్ల 80 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని అడవులు కనుమరుగైపోయాయి. సమితి నివేదికల ప్రకారం- ప్రపంచ దేశాల్లో ఏటా 47 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వనాలు అంతరించిపోతున్నాయి. 80శాతం వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా సముద్రాలు, నదుల్లో విడిచిపెడుతున్నారు. గడచిన శతాబ్ద కాలంలో సగం మేర చిత్తడి నేలలు అంతరించిపోయాయి. సముద్రాల అంతర్భాగంలోని పగడపు దిబ్బలు యాభై శాతం మేర నాశనమయ్యాయి. తీర వ్యవస్థలకు రక్షణ కవచాల్లాంటి ఈ పగడపు దిబ్బలు 2050 నాటికి 90శాతం మేర అంతర్ధానమవుతాయని అంచనా. ప్రకృతి వ్యవస్థల వినాశనం తాలూకు పర్యవసానాలను కొవిడ్ రూపంలో ప్రపంచ దేశాలు నేడు ఎదుర్కొంటున్నాయి. జంతువుల సహజసిద్ధమైన ఆవాసాలు కుంచించుకుపోవడంవల్ల కరోనా వైరస్ వంటి వ్యాధి కారకాలు మానవాళికి ప్రాణాంతకంగా పరిణమించాయి. ప్రకృతి వనరుల విధ్వంసంవల్ల వాయుకాలుష్యం పెచ్చరిల్లుతోంది. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు మూలంగా తలెత్తే మరణాల్లో మూడింట ఒక వంతుకు వాయుకాలుష్యం కారణమవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. 90శాతం వాయుకాలుష్య ప్రభావ మరణాలు అల్ప, మధ్య తరహా ఆదాయం కలిగిన ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్యమయమైన 30 నగరాల్లో 22 భారతదేశంలోనే ఉన్నాయి.
వనాల పరిరక్షణ తక్షణ కర్తవ్యం
సహజవనరుల వినియోగంలో నియంత్రణ సాధ్యమైనప్పుడే సమితి ఉపదేశించే ప్రకృతి వ్యవస్థల పునరుద్ధరణను ప్రపంచ దేశాలు వేగవంతంగా సాధించే అవకాశం ఉంటుంది. కర్బన ఉద్గారాలను అధిక స్థాయిలో విడుదల చేసే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసివేసి- సౌర, వాయు విద్యుదుత్పత్తి దిశగా ప్రభుత్వాలు కదలాలి. భూగోళంపైన అడవుల పరిరక్షణ మహోద్యమంగా సాగినప్పుడే సర్వ ప్రకృతి వినాశనాలను సమర్థంగా ఎదుర్కోగల శక్తి మానవాళికి లభిస్తుంది. అటవీ వనాల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు కృషి జరుపుతున్నట్లు చెబుతున్నా- క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సున్నితమైన అటవీ, తీర, చిత్తడి నేలల రక్షణలో స్థానికుల పాత్ర అంతకంతకూ నామమాత్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు ఇటీవల లక్ష దీవుల్లో పర్యాటక అభివృద్ధి పేరుతో స్థానిక సమూహాల అభిమతానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలే నిదర్శనం. అడవుల అభివృద్ధితో పాటు పర్యాటక ఆకర్షణల కోసం జరిగే ఎటువంటి కార్యక్రమాలైనా స్థానిక ప్రజల సంప్రదింపులతో, వారి భాగస్వామ్యంతో అమలు చేయాలని మన ప్రభుత్వ అటవీ, పర్యాటక విధానాలు చెబుతున్నాయి. తరచి చూస్తే పరిస్థితి వేరే విధంగా ఉంది. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సాయంతో రెండు దశాబ్దాల క్రితం అనేక రాష్ట్రాల్లో ఉమ్మడి అటవీ యాజమాన్య పథకం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా అడవులపై ఆధారపడే ప్రజలకు జీవనోపాధులు కల్పించడంతో పాటు అటవీ వన పరిరక్షణలో భాగస్వాములను చేయడంతో ప్రారంభంలో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ పథకం కింద అడవుల్లోని స్థానిక సమూహాలతో ఏర్పాటైన వనసంరక్షణ సమితి సభ్యులు- వన్య ప్రాణుల వేట, కలప అక్రమ రవాణా, తీరంలో ఇసుక తవ్వకాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రభుత్వ వ్యవస్థలను అప్రమత్తం చేసేవారు. కాలక్రమంలో ఈ ప్రక్రియ నెమ్మదించింది. ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులను సమీక్షించుకోవాలి. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచ స్థాయిలో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు కంకణబద్ధం కావాలి. అందుకోసం క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర, కేంద్ర స్థాయుల్లో అటవీ, తీర ప్రాంతాల పరిరక్షణ కోసం ప్రణాళికలను రూపొందించాలి. ప్రకృతి వ్యవస్థల పునరుద్ధరణ కోసం అత్యంత చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేసినప్పుడే భవిష్యత్ తరాల జీవనానికి భరోసా దక్కుతుంది.
భూతాపంతో కష్టకాలం
గడచిన కొన్నేళ్లలో ఐరోపా, చైనా, ఆసియా దేశాల్లోని అనేక ప్రాంతాల్లో వీచిన వేడిగాలులు, కరవు పరిస్థితులు ప్రజలను కష్టాలపాల్జేశాయి. అమెరికా, ఆస్ట్రేలియాల్లో అటవీ ప్రాంతాలను ఆహుతి చేసిన కార్చిచ్చులు వేలాది హెక్టార్ల అడవులను, అనేక అరుదైన జీవ జాతులనూ హరించాయి. భారతదేశంలోని అసోం, పశ్చిమ్ బంగ, కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో అనూహ్యంగా వర్షపాతం పెరగడంవల్ల వరదలు, తుపానులు సంభవించి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భూతాపం పెరుగుదల, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలే ఈ ఉపద్రవాలకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం పెరుగుదల నియంత్రణకు 2015లో ప్యారిస్ వేదికగా ప్రపంచ దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. 2050 నాటికి సగటు భూతాపం పెరుగుదలను రెండు డిగ్రీల సెంటీగ్రేడు కంటే మించకుండా చేసేందుకు 196 దేశాలు ప్రతిన బూనాయి. కానీ, ఒప్పందం అమలు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది!
- గంజివరపు శ్రీనివాస్
(రచయిత- అటవీ పర్యావరణ రంగ నిపుణులు)
ఇదీ చూడండి: ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు