మనం తెలియని దారుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు గమ్యస్థానం చేరేందుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. జీపీఎస్ అనేది భూతల సమాచారానికి (జియో స్పేషియల్ డేటా) సంబంధించిన ఒక సాధనం. పారిశ్రామిక, పర్యావరణ అవసరాలకు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, దూర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి, పేదలకు సంక్షేమ సేవలు అందించేందుకు, ఇంకా ఎన్నో ఇతర రంగాల అవసరాలకు రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహాలు వంటి సాధనాలు సమకూర్చే పటాలు, సమాచారాన్ని వినియోగిస్తాం. ఇలాంటి సమాచారాన్ని జియో స్పేషియల్ డేటాగా వ్యవహరిస్తారు. వర్తమాన ప్రపంచంలో ఈ డేటా లేకుండా ఆర్థిక, సాంఘిక అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన సాధ్యంకాదు. అయితే మన దేశానికి సంబంధించి ఇలాంటి సమాచారాన్ని విదేశీ సంస్థలే రూపొందిస్తున్నాయి.
మన భూతలాన్ని శోధించి, గ్రహించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలు అంతర్జాలం ద్వారా మనకే విక్రయిస్తున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పనకు సమాచార కొరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశోధన కేంద్రాలు జియో స్పేషియల్ విధానంలో సంస్కరణల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో జియో స్పేషియల్ సమాచార నిబంధనల్ని సరళీకరిస్తూ ఫిబ్రవరి 15న కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనితో భూతల పటాల తయారీ, జియో స్పేషియల్ డేటా ఉత్పత్తిపై ప్రభుత్వ నియంత్రణలు తొలగిపోయాయి. డేటా నిర్వహణపై స్వదేశీ ప్రైవేట్ కంపెనీలకు, వ్యక్తులకు, పరిశోధన సంస్థలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కొత్త విధానంతో జియో స్పేషియల్ రంగంలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటుంది.
అభివృద్ధిలో కీలకం
ఇకపై భారత పౌరులు, సంస్థలు మనదేశ భూతలానికి సంబంధించిన సమాచార సేకరణ చేయవచ్చు. పటాలను రూపొందించి, భద్రపరిచి, పంచుకోవచ్చు. ప్రజాబాహుళ్యంలో ఉంచవచ్చు. అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎలాంటి ముందస్తు అనుమతులూ అవసరం లేదు. విదేశీ కంపెనీలు భారత కంపెనీల వద్ద సమాచారాన్ని సేకరించి భారత్‌లోని వినియోగదారుల కోసమే ఉపయోగించాల్సి ఉంటుంది. భారత కంపెనీలు, వ్యక్తులు, పరిశోధన సంస్థలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించినట్లు స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోతుంది. సమాచార తయారీ ప్రక్రియపై ఎలాంటి ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉండదు. గతంలో జియో స్పేషియల్ విధానం-2016 నిబంధనల ప్రకారం డేటా తయారీ పూర్తిగా ప్రభుత్వం చేతిలో, భారత సర్వే సంస్థ ఆధిపత్యంలో ఉండేది. కఠినమైన నిబంధనలు ఉండేవి.
ఫలితంగా అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణంలో విపరీత జాప్యం జరిగేది. సమాచార కొరత ప్రణాళిక రూపకర్తలను వేధించేది. ఇప్పుడు- నూతన జియో స్పేషియల్ విధానం ఆకర్షణీయ నగరాలు, డిజిటల్ ఇండియా, అత్యాధునిక ప్రజారవాణా, లాజిస్టిక్స్, ఇ-కామర్స్, వ్యవసాయ మౌలిక వసతుల కల్పన, ప్రకృతి విపత్తుల నివారణ, పర్యావరణ, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ మొదలైన అనేక రంగాల అభివృద్ధికి కీలకమవుతుంది. అంకుర పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు, ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు లబ్ధి కలుగుతుంది. 2030 నాటికి కోట్ల రూపాయల విలువైన జియో స్పేషియల్ సమాచార సేకరణకు, వినియోగానికి వీలవుతుంది. అంతరిక్ష పరిశ్రమ, 5జీ, టెలికాం, రక్షణ, గనులు, గ్యాస్ వంటి రంగాలు సంస్కరణల వల్ల ప్రయోజనం పొందుతాయి. మన కంపెనీలు కూడా గూగుల్ ఎర్త్, గూగుల్ మ్యాప్ తరహాలో భూతల పటాలను అభివృద్ధి చేయగలవు. అత్యున్నత నాణ్యతతో కూడిన పటాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాలకు కొత్త విధానం ఎంతో మేలు చేస్తుంది.
అందుబాటులో ఉంచాలి
జియో స్పేషియల్ సమాచారంలో కచ్చితత్వం, నాణ్యత చాలా అవసరం. వివిధ సంస్థలు సృష్టించిన సమాచారంలో నాణ్యత, సాధికారత, విశ్లేషణ తదితర సమస్యలుంటాయి. వాటి పరిష్కారానికి ఒక కేంద్రీకృత ఏజెన్సీ ఉండాలి. సాధారణంగా జియో స్పేషియల్ సమాచారం సంక్లిష్టంగా సామాన్యుడికి అర్థంకాని రీతిలో ఉంటుంది. దీన్ని సరళంగా రూపొందించి ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలి. నూతన విధానంలో ఉన్న అనుకూలత వల్ల సమాచార విస్ఫోటం సంభవించే అవకాశముంది. దేశ భద్రత దృష్ట్యా పౌర, రక్షణ అంశాల ప్రాతిపదికన వర్గీకరణ తప్పనిసరి.
ఈ రంగంలో సామర్థ్యం పెంపుదలపై దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయాల్లో మరిన్ని కోర్సుల రూపకల్పన జరగాలి. నూతన విధానం విలువైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, దేశానికి అదనపు ఆదాయాన్నీ సృష్టించగలుగుతుంది. ప్రపంచ మార్కెట్లో మన జియో స్పేషియల్ ప్రాజెక్టులను ఇతర దేశాలకు దీటుగా నిలబెట్టనూగలదు. ఈ రంగం ఏటా 15శాతం పెరుగుదలతో 2025 నాటికి 10 లక్షల మందికి ఉపాధి కల్పించగలదని అంచనా. మన జియో స్పేషియల్ ఆర్థిక వ్యవస్థ విలువ రెండింతలు కావాల్సి ఉంది. అందుకోసం స్వదేశీ పరిశ్రమ వృద్ధితో పాటు ఎగుమతులు పెరగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థ కార్యాచరణ, పటిష్ఠ వ్యూహాలతో ముందుకు కదలాలి.
రచయిత- పుల్లూరు సుధాకర్, పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు