సాధారణంగా చిన్నారులకు కొత్త రుచుల పరిచయం ఏడాది లోపు నుంచే మొదలుపెట్టాలి. కుటుంబ సభ్యులు, ఇంటి వాతావరణం బట్టే పిల్లల అలవాట్లు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు తన ముందు తినడం మొదలు పెట్టండి. అప్పుడు మిమ్మల్ని చూసి తను కూడా తింటుంది.
ఆకర్షణీయంగా...
కంటికింపుగా కనిపించే పదార్థాలను పిల్లలు ఇష్టపడతారు. అందువల్ల పండ్ల ముక్కలను రకరకాల ఆకారాల్లో కోసి, అందమైన గిన్నెలు, ట్రేలలో ఆకర్షణీయంగా అమర్చి ఇవ్వండి. మిల్క్ షేక్స్, స్మూథీ, పండ్లరసాలను తనకిష్టమైన బొమ్మల గిన్నెలు, గ్లాసుల్లో పోసి తాగించండి. ఓ పండుని తీసుకుంటే... గుజ్జు, ముక్కలు, జ్యూస్... ఇలా ఒక్కోరకంగా చేసి ఇవ్వొచ్చు. కనీసం పది, పదిహేను రకాల పండ్లను రుచి చూపిస్తే కనీసం ఐదారైనా చిన్నారి అలవాటు చేసుకుంటుంది.
కొద్దిమొత్తంలో..
చిన్నారుల పొట్ట చాలా చిన్నది. అందులో పట్టేంత పదార్థాలనే పెట్టాలి తప్ప గిన్నె, గ్లాసు మొత్తం అయిపోవాల్సిందే అని వారిని బలవంతం చేయొద్దు. ఈ విషయం ప్రతి అమ్మా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు 50 నుంచి 100 ఎం.ఎల్.పండ్ల రసం సరిపోతుంది. అలాగే గుప్పెడు ముక్కలు (కనీసం100 గ్రా.) తిన్నా పొట్ట నిండుతుంది. పండ్ల రంగు, రుచులతోపాటు వాటిని తినడం వల్ల కలిగే లాభాలనూ వారికి వివరించాలి. అప్పుడే తినడానికి ఇష్టపడతారు. అరటి, యాపిల్, మామిడి పండ్ల నుంచి ఎక్కువ కెలొరీలు వస్తాయి. కాబట్టి వాటిని అన్నం తినేముందు, తిన్న వెంటనే కాకుండా... మధ్యమధ్యలో ఆడుకుని వచ్చాక, పెట్టాలి. పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పీచు, పోషకాలు బోలెడు ఉంటాయి.
మరో మాట...
చిన్నారి స్వీట్సు తినడం లేదని బాధపడొద్దు. అది సమస్య కానేకాదు. అదే సమయంలో కారంగా ఉండే చిప్స్, మిక్చర్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తింటుందా గమనించండి. వీటిలో కెలొరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటుంటే ఆకలి కాకపోవచ్చు. అలాగే పాపకు మూడు పూటలా అన్నమే పెట్టాలనేమీ లేదు. చపాతీ, దోసె, ఇడ్లీ... వంటివీ పెట్టొచ్చు.
ఇదీ చదవండి: అభివృద్ధిని చూసి ఓటు వేయండి: మంత్రి ఎర్రబెల్లి