ఇన్నేళ్లు ఖాసీం సులేమానీ నీడలో జీవించిన ఇస్మాయిల్ ఘానీ ఇకపై కుర్ద్ ఫోర్స్‌కు నాయకత్వ వహించనున్నారు. సులేమానీ మరణంతో అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలోనే సారథ్య బాధ్యతలను అందుకోనున్నారు.
ఇరాన్ రివల్యుషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీం సులేమానీని అమెరికా సేనలు హతమార్చిన నేపథ్యంలో ప్రతీకార దాడికి సిద్ధంగా ఉండాలని అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది ఇరాన్. ఈ తరుణంలో ఘనీ నాయకత్వం ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశమైంది. 1,25,000 సైన్యమున్న రివల్యుషనరీ గార్డ్స్ కమాండర్ కేవలం ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీకి మాత్రమే సమాధానం చెప్పవలసి ఉంటుంది.
అమెరికాపై రగిలిపోతున్న కుర్ద్ ఫోర్స్ సేనలు ఇప్పటికే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరిశీలిస్తున్నాయని తెలుస్తోంది. పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా నావికాదళంపై ఇప్పటికే ఇరాన్ నౌకాదళం నిఘా ఉంచింది. ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న ఇరాన్‌కు బలంగా ఉన్న కుర్ద్ ఫోర్స్ కమాండర్ నిర్ణయాలు ఆయా అంశాల్లో ప్రస్తుతం కీలకంగా మారనున్నాయి.
ఎవరీ ఘానీ..?
1957 ఆగస్టు 8న మషద్ పట్టణంలో జన్మించిన ఇస్మాయిల్ ఘానీ.. 1979 విప్లవం తర్వాత సైన్యంలో చేరారు. సులేమానీ లాగానే 80వ దశకంలో ఎనిమిదేళ్లపాటు ఇరాక్‌తో యుద్ధంలో ఇరాన్ తరఫున పోరాడారు ఘానీ. అనంతర కాలంలో కుర్ద్ ఫోర్స్‌లో చేరారు. అయితే ఘానీ గురించి బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియనప్పటికీ.. చాలా ఏళ్లుగా ఆయనకు కుర్ద్ ఫోర్స్‌తో సంబంధాలు ఉన్నాయని పాశ్చాత్య నేతలు చెబుతున్నారు.
సులేమానీతో మైత్రి
ఖాసీం సులేమానీ, తాను యుద్ధంలోనే తొలిసారిగా కలిశామని ఇరాన్ అధికారిక మీడియా ఇర్నాకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పుకొచ్చారు ఇస్మాయిల్. తాము యుద్ధరంగంలో సహచరులమని.. అక్కడే మైత్రి ఏర్పడిందని తెలిపారు.
ఘానీని కుర్ద్ ఫోర్స్ కమాండర్‌గా ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ. అత్యంత సమర్థ కమాండర్లలో ఇస్మాయిల్ ఒకరని చెప్పారు. ఇంతకుముందు ఉన్న విధంగానే కుర్ద్ఫోర్స్ కొనసాగుతుందని చెప్పారు.
ఘానీపైనా అమెరికా కన్ను..
అమెరికా ఖజానా విభాగం 2012లో ఘానీపై ఆంక్షలు విధించింది. కుర్ద్ ఫోర్స్‌కు దగ్గరగా ఉండే ఉగ్రసంస్థలకు ఘానీ ఆర్థిక సహకారం అందిస్తుంటారని పేర్కొంది. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ భద్రతా సిబ్బంది.. వందమందిని చంపడంపై ఘానీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 'సిరియాలో ఇస్లామిక్ రిపబ్లిక్ లేనట్లయితే ఊచకోత ఇంకా దారుణంగా ఉండేది' అని 2012లో నాటి పరిస్థితులపై వ్యాఖ్యానించారు ఘానీ. దీనిపై అగ్రరాజ్యం అమెరికా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కే నేరుగా హెచ్చరికలు.. అసలు ఎవరీ సులేమానీ?