World Largest Luxury Ship : చైనా మరో భారీ విలాసవంతమైన ఓడను నిర్మించి ఔరా అనిపించింది. గ్వాంగ్‌ఝౌ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ భారీ ఓడ పేరు మోబీ లెగసీ. మంగళవారమే ఈ నౌక తన సాగర ప్రయాణాన్ని ప్రారంభించింది. తన తొలి ప్రయాణంలో ఇది గ్వాంగ్‌ఝౌ తీరం నుంచి ఇటలీకి బయల్దేరింది ఈ ఓడ. 70 వేల టన్నులకు పైగా బరువును తరలించే సామర్థ్యం మోబీ లెగసీ సొంతం.
మోబీ లెగసీ 2వేల 500ల మంది ప్రయాణికులను తరలించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటితో పాటు 800 కార్లు, ట్రక్కుల వంటి వాహనాలను తరలించే వీలుంటుంది. ఈ ఓడ పొడవు 237 మీటర్లని తయారీ సంస్థ తెలిపింది. మోబీ లెగసీలో 13 అంతస్తులు ఉంటాయి. పైన అంతస్తు వైశాల్యం 16వేల చదరపు మీటర్లు కాగా అందులో 10వేల చదరపు మీటర్ల స్థలాన్ని రెస్టారెంట్లు, విశ్రాంతి, వినోద సౌకర్యాల కోసం కేటాయించారు. ఇక ఇందులో మొత్తం 533 విలాసవంతమైన గదులు నిర్మించారు.
మోబి లెగసీని తేలియాడే స్టార్ హోటల్ అని కూడా అనవచ్చు. నచ్చిన ఆహారాన్ని అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉన్న చెఫ్‌లు ఇక్కడ ఉన్నారు. సంగీతంతో పాటు కడలి అందాలను తిలకించేందుకు ప్రత్యేక స్పాట్లు ఈ షిప్‌లో ఉన్నాయి.
అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం
China Space Telescope : అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడుతున్న చైనా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే సుదూర అంతరిక్షం నుంచి రేడియో సిగ్నల్స్‌ను స్వీకరించగల ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ను గుయిజౌ ప్రావిన్సులో డ్రాగన్ నిర్మించింది. ఇప్పుడు ఉత్తరార్ధ గోళంలోనే పెద్దదైన అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఖగోళంలో అప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలను పరిశీలించి, పరిశోధనలు చేయడం సాధ్యపడుతుంది. దాదాపు 2.5 మీటర్ల వ్యాసంతో ఈ వైడ్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్ WFSTని రూపొందించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి