కరోనాపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు, ఇతర దేశాల ఆరోగ్య నిపుణులకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఉద్యోగ వీసాపై పనిచేస్తున్న వారి వీసా గడువును ఉచితంగా ఏడాదిపాటు పెంచుతున్నట్టు హోంమంత్రి ప్రీతి పటేల్ ప్రకటించారు. తక్షణమే ఈ ప్రకటన అమలవుతుందని స్పష్టం చేశారు.
అక్టోబర్‌లో గడువు ముగియనున్న రేడియోగ్రాఫర్లు, సామాజిక కార్యకర్తలు, ఫార్మసిస్ట్‌ల వీసాలను మరో ఏడాది పాటు పొడింగించింది బ్రిటన్ ప్రభుత్వం. నేషనల్ హెల్త్ సర్వీస్‌తో పాటు స్వతంత్రంగా పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఈ పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఎన్హెచ్ఎస్ వైద్యులు, నర్సులు, పరిశోధకుల వీసాలను పొడిగిస్తున్నట్టు గత నెలలోనే ప్రకటన చేశారు ప్రీతి పటేల్. క్లిష్టపరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలను కొనియాడారు.
బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో 3వేలమంది నిపుణులు, వారి కుటుంబ సభ్యులు లబ్ధిపొందనున్నారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి అక్టోబర్ 1 మధ్యలో గడువు ముగుస్తున్న వీసాలకు ఈ తాజా ప్రకటన వర్తిస్తుందని పేర్కొన్నారు.