కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తున్న బ్రిటన్‌లో.. భారత సంతతి ప్రజలే వైరస్‌కు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఏప్రిల్ 17 వరకు కరోనా సోకి మరణించిన 13వేల 918 మంది రోగుల్లో.. 16.2 శాతం మంది ఆఫ్రికా, ఆసియా, మైనార్టీ దేశాల మూలాలున్న వారేనని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) గణాంకాలు వెల్లడించాయి.
మరణించిన 16.2 శాతంలో భారతీయ మూలాలు ఉన్న వారు 3 శాతం, కరేబియన్లు 2.9 శాతం, పాకిస్థానీలు 2.1 శాతం ఉన్నారని ఎన్హెచ్ఎస్ ప్రకటించింది. బంగ్లాదేశ్ జాతీయులు 0.6, చైనీయులు 0.4 శాతం మరణించారు. ఇప్పటి వరకు కొవిడ్ 19 సోకి 73.6 శాతం మంది బ్రిటీషర్లు ప్రాణాలు కోల్పోయారు.
ఆఫ్రికా, ఆసియా, మైనార్టీ దేశాల మూలాలు ఉన్న వారి మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడం వల్ల బ్రిటీష్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. విదేశీ మూలాలు ఉన్న వారు చాలా ఎక్కువ మంది మరణించడం తనను తీవ్రంగా బాధిస్తోందని.. యూకే ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో అసమానతలను తొలిగించాలని.. జనాభాలోని అన్ని వర్గాలను సమానంగా రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ చాంద్ నాగ్‌పాల్ కోరారు.