పీహెచ్డీ పట్టభద్రులకు ఎర్ర తివాచీ పరిచేందుకు నిర్ణయం తీసుకుంది బ్రిటన్. ఈ నిర్ణయంతో లాభపడే వారిలో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు.
ఉన్నత చదువులు చదివిన వారికి ఎలాంటి వీసా ఆంక్షలు ఉండబోవని ఈ నిర్ణయం ఏడాది చివర్లో అమల్లోకి వస్తుందని బ్రిటన్ ఛాన్స్లర్ ఫిలిప్ హమండ్ ప్రకటించారు.
"సాంకేతిక విప్లవంలో బ్రిటన్ను ముందంజలో నిలిపి ఆర్థిక మూలాల్ని పటిష్టం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాం. దీనిలో భాగంగా ఉన్నత విద్యావంతులకు వీసా ఆంక్షల్ని సడలించాం. ఈ ఏడాది చివరి నుంచి పీహెచ్డీ పట్టభద్రులకు ఏ విధమైన వీసా ఆంక్షలు ఉండవు." -ఫిలిప్ హమండ్, బ్రిటన్ ఛాన్స్లర్
ఈ నూతన విధానం అమల్లోకి వస్తే సాధారణ వీసాలకు వర్తించే టైర్-2 నిబంధనలు పీహెచ్డీ పట్టభద్రులకు వర్తించవు. పరిశోధకులు ఇతర దేశాల్లో తమ అధ్యయనాన్ని కొనసాగించేందుకు వీలుగా 180 రోజులు బ్రిటన్లో ఉండాలనే నిబంధనను సైతం సడలించనుంది ప్రభుత్వం.
భారతీయులు అధికం...
2018వ సంవత్సరంలో టైర్-2 వీసా కేటగిరి కింద బ్రిటన్ వెళ్లిన వారిలో గత ఏడాదితో పోలిస్తే 6 శాతం భారతీయులు పెరిగారు. బ్రిటన్ విద్యా వ్యవస్థలో అధ్యాపకుల సంఖ్యలో భారత్కు చెందినవారు మూడో స్థానంలో ఉన్నారు.
బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి విశ్వవిద్యాలయాలు స్వాగతిస్తున్నాయి. పరిశోధకులకు నిబంధనలు సడలించడం కారణంగా అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు జరిగే అవకాశం ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నాయి.