శాస్త్రీయ పరిశోధనలు, మానవత్వ స్పృహతో కరోనాపై పోరులో ప్రపంచం పురోగతి సాధించిందని.. అయితే మహమ్మారి భయమింకా పూర్తిగా తొలగిపోలేదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. అయితే శీతాకాలం తర్వాత వచ్చే వసంతకాలాన్ని ఆపలేమని.. అలాగే కరోనా పోరులో సానుకూలంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రపంచీకరణతోనే మేలు..
కరోనాను సాకుగా చూపి.. ప్రపంచీకరణ లాభాలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్న జిన్‌పింగ్... ప్రపంచీకరణ ఫలితాలను తక్కువచేసి చూపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. దావోస్లో ఆదివారం ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు.
"అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య విభజన రేఖను చెరిపెయ్యాలి. కరోనాపై పోరు సహా.. ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది."
-దావోస్ ప్రసంగంలో జిన్‌పింగ్.
కరోనా టీకా పంపిణీ కోసం ప్రపంచదేశాలన్ని సహకరించుకోవాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. సమాన హక్కులు, అవకాశాల ద్వారా అన్ని దేశాలు అభివృద్ధి ఫలాలను పొందుతాయన్నారు. పరస్పర చర్చల ద్వారా వివాదాల పరిష్కారానికి చైనా కట్టుబడి ఉందన్నారు.
ఇదీ చదవండి: 'భారత్-చైనా 'సిక్కిం ఘర్షణ' చిన్నదే!'