జమ్మూ-కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుపై భారత్ లక్ష్యంగా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది దాయాది దేశం పాకిస్థాన్. కశ్మీర్ రాయబారిగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతానని స్పష్టం చేశారు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్.
జీ-7 శిఖరాగ్ర సమావేశం వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడో దేశ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు ఇమ్రాన్. ఆంక్షలు ఎత్తేసే వరకు కశ్మీరీలకు పాకిస్థాన్ అండగా ఉంటుందని తెలిపారు.
కశ్మీరీలకు అండగా నిలవడమే తమ వ్యూహంగా అభివర్ణించారు పాక్ ప్రధాని. ఐరాస సాధారణ సమావేశాలు సహా ప్రతి అంతర్జాతీయ వేదికపైనా ఒక రాయబారిగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి మోదీ చారిత్రక తప్పు చేశారని విమర్శించారు.
నిరాశలో కశ్మీరీలు: ఇమ్రాన్
కశ్మీరీల హక్కులను సంరక్షించడం ఐరాస బాధ్యత అని, శక్తివంతమైన దేశాలవైపు అంతర్జాతీయ వ్యవస్థలు నిలవడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. ఐరాస చర్యలను ప్రపంచమంతా గమనిస్తోందని పేర్కొన్నారు.
అధికరణ రద్దుపై ముస్లిం దేశాలు బాసటగా నిలవకపోవడం వల్ల కశ్మీరీలు నిరాశకు లోనయ్యారని తెలిపారు ఇమ్రాన్. ఇస్లాం దేశాలు ఆర్థిక ప్రయోజనాల కోసం కశ్మీర్ సమస్యను లేవనెత్తడం లేదని... ఎప్పటికైనా ఈ అంశమై ప్రశ్నాస్త్రాలు సంధిస్తాయని పేర్కొన్నారు.
అణ్వస్త్రాలున్న రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే విజేతలుగా ఎవరూ నిలవరని ఇమ్రాన్ హెచ్చరించారు. అణుయుద్ధం సంభవిస్తే ఆ పరిణామాలను ప్రపంచం మొత్తం అనుభవించాల్సి ఉంటుందన్న పాక్ ప్రధాని.. అగ్ర దేశాలు మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి : చంద్రయాన్... జాబిల్లి ఛాయాచిత్రాలు పంపేన్