ఉగ్రవాద కాల్పులు, మొట్టమొదటి మహిళా ఆత్మాహుతి దాడి ఘటనలతో వాయవ్య పాకిస్థాన్‌లో తొమ్మిది మంది మరణించారు. వీరిలో ఆరుగురు పోలీసులూ ఉన్నారు. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దేరా ఇమ్మాయిల్ ఖాన్ జిల్లాలో ఈ దుర్ఘటనల జరిగింది.
ఇదీ జరిగింది..
రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కోట్లా సైదాన్ చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసులపై ఒక్కసారిగా కాల్పులకు తెగించారు. తీవ్రంగా గాయపడిన పోలీసులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం అదే ఆస్పత్రిలో ఓ ముస్లిం మహిళ ఆత్మాహుతి దాడికి తెగించింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు సైనిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
దాడికి పాల్పడిన మహిళ వెంట్రుకలు, పాద ముద్రలు సేకరించిన పోలీసులు దర్యాప్తునకై వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ దాడికి తామే తెగించినట్లు తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) ప్రకటించింది.