అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కొవిడ్-19పై ప్రజలకు సమాచారం అందించేందుకు వచ్చినప్పుడల్లా పక్కనే ఓ బక్కపలచటి వ్యక్తి కనిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన ట్రంప్ తొందరపాటు ప్రకటనల్ని సరిచేస్తున్నారు. ట్రంప్ కూడా ఆ పెద్దాయనకు ఎదురుచెప్పడం లేదు. ఎవరి మాటా ఒక పట్టాన వినని ట్రంప్‌ను కట్టడి చేస్తున్న ఆ వ్యక్తిపేరు ఆంటోనీ ఫౌచి. ప్రస్తుతం కొవిడ్ సమాచారం కోసం అమెరికన్లు ఫౌచి మాటపైనే ఆధారపడుతున్నారంటే అతిశయోక్తి కాదేమో!
ప్రస్తుతం అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్టియస్ డిసీజెస్(ఎన్‌ఐఏఐడీ) డైరెక్టర్‌గా ఫౌచి పనిచేస్తున్నారు. రొనాల్డ్ రీగన్ నుంచి ట్రంప్ వరకు ఆరుగురు అధ్యక్షుల వద్ద పనిచేసిన అనుభవం ఆయనది. 30 ఏళ్లుగా ప్రతి ఆరోగ్య సంక్షోభంలోనూ అమెరికాకు మార్గదర్శకుడిగా ఫౌచి వ్యవహరించారు. ఈ క్రమంలో హెచ్‌ఐవీ, సార్స్, మెర్స్, ఎబోలా, 2001 బయో టెర్రరిజంను ఎదుర్కోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. 1984లో ఎయిడ్స్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దీనిపై అమెరికా విధానాలను ఆయనే తయారుచేశారు.
అమెరికన్ల మనసు దోచేశాడు
2014 తమ దేశ నర్సుకు సియోర్రా లియోన్‌లో ఎబోలా సోకిందని తెలియగానే అమెరికా వణికిపోయింది. వైద్యులు ఆమె దగ్గరకు వెళ్లడానికే భయపడుతున్న దశలో 74ఏళ్ల ఫౌచినే రక్షణ సూట్ ధరించి రంగంలోకి దిగారు. రెండువారాల పాటు రోజుకు 2 గంటలు చొప్పున స్వయంగా ఆ నర్సుకు వైద్యం చేశారు. ఆమెకు నయం అయ్యాక ఎన్‌ఐహెచ్ ఆసుపత్రి నుంచి బాహ్యప్రపంచానికి రాగానే టీవీ కెమెరాల ముందు ఆత్మీయంగా దగ్గరకు తీసుకొన్నారు. ఎబోలా ఇక ఏమాత్రం లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. ఎబోలా మరణాలు తగ్గించేందుకు రోగికి ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ అందించాలనే విజయవంతమైన వ్యూహం ఫౌచిదే.
ట్రంప్ తప్పులు దిద్దుతూ..
దాదాపు ఆరేళ్ల తర్వాత కొవిడ్-19పై అమెరికా పోరాటంలో శ్వేతసౌధం టాస్క్‌ఫోర్స్‌లో ఫౌచి భాగస్వామి అయ్యారు. పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఎదుట ధైర్యంగా అంగీకరించారు. కొవిడ్ కనీసం లక్షమంది అమెరికన్ల ప్రాణాలు తీస్తుందన్న ఫౌచి మాటలతో ట్రంప్ ఏకీభవించారు. మలేరియాకు వాడే ఔషధం కొవిడ్‌పై ప్రభావం చూపిస్తుందని ట్రంప్ ఒక ప్రెస్‌మీట్‌లో అత్యుత్సాహంగా ప్రకటించారు. వెంటనే పక్కనే ఉన్న ఫౌచి స్పందిస్తూ ట్రంప్ మాటలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తోసిపుచ్చారు. దటీజ్ ఫౌచి..!