అమెరికా ప్రజాప్రయోజనాలను కోరుకునే చట్టబద్ధ వలసదారులకు గ్రీన్ కార్డ్ లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసాలను తిరస్కరించే నిబంధనకు ట్రంప్ సర్కార్ పచ్చజెండా ఊపింది. సోమవారం నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ఫలితంగా నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు అందించే ఆహార స్టాంపులను కూడా వలసదారులకు దూరం కానున్నాయి.
'పబ్లిక్ ఛార్జ్' నియంత్రణలపై అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది శ్వేతసౌధం. అమెరికాలో చట్టబద్ధ శాశ్వత నివాసి హోదాకు అర్హులెవరో హోంలాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయిస్తుందని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి స్పష్టం చేశారు.
"సుప్రీంతీర్పును అనుసరించి, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం సోమవారం నుంచే ఈ నియంత్రణలను అమలు చేస్తుంది. కష్టపడి పనిచేసే అమెరికా పన్ను చెల్లింపుదారులకు రక్షణ కల్పిస్తుంది. నిజమైన పేద అమెరికన్ల సంక్షేమ కార్యక్రమాలను సంరక్షిస్తుంది. ఫెడరల్ ద్రవ్యలోటునూ తగ్గిస్తుంది. మన సమాజానికి కొత్తగా వచ్చినవారు పన్ను చెల్లింపుదారులపై ఆధారపడకుండా, ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలన్న... అమెరికా ప్రాథమిక న్యాయ సూత్రానికి ఈ నిర్ణయం న్యాయం చేకూరుస్తుంది." - స్టెఫానీ గ్రిషామ్, శ్వేతసౌధం మీడియా కార్యదర్శి
భారతీయులకు దెబ్బ
2019 ఆగస్టు 14న రూపొందించిన ఈ నిబంధనలు వాస్తవానికి 2019 అక్టోబర్ 15 నుంచే అమల్లోకి రావాల్సింది. కానీ వివిధ కోర్టుల తీర్పుల కారణంగా ఇప్పటి వరకు అమలు కాలేదు. అగ్రరాజ్యం తాజాగా ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. హెచ్-1బీ వీసా ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన శాశ్వత నివాసం పొందడం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇదీ చూడండి: వైరల్ వీడియో : బాహుబలిగా ఒదిగిపోయిన 'ట్రంప్'