అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అవసరమయ్యే హెచ్1బీ వీసా పొందడం ఇకపై మరింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమయ్యే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ హెచ్1బీ వీసా ధరఖాస్తుల రుసుమును పెంచే యోచనలో ఉందని అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించి అమెరికా కాంగ్రెస్‌లో ప్రకటన సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. అయితే... రుసుము ఎంత పెంచుతారు, ఏ వర్గాల దరఖాస్తుదారులకు వర్తింపచేస్తారన్న అంశంపై అలెగ్జాండర్ స్పష్టత ఇవ్వలేదు.
ఏటా భారతీయ ఐటీ సంస్థలే హెచ్1బీ వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేస్తుంటాయి. ఇప్పుడు రుసుము పెంచడం... ఆయా సంస్థలపై అదనపు భారం కానుంది.
ఎందుకు?
అమెరికాలో అప్రెంటిస్ ప్రోగ్రామ్‌లకు అధిక నిధులు సమకూర్చేందుకే హెచ్1బీ దరఖాస్తు రుసుము పెంచాలని భావిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. ఐటీ రంగాల్లోని ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికన్ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ నిధులు ఖర్చుచేయనుంది.