'డేటా స్థానికీకరణ' అడిగిన దేశాలపై వీసా పరిమితి అస్త్రాన్ని ప్రయోగించాలని అమెరికా భావిస్తోందన్న వార్తలపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని స్పష్టంచేసింది. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సమాచార వ్యాప్తిపై చర్చలకు, హెచ్1బీ వీసాల అంశం పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఒకవేళ భారత్‌పై హెచ్1బీ వీసాల పరిమితి విధిస్తే అది తమ దేశానికి తామే హాని చేసుకున్నట్లు అవుతుందని ప్రకటించింది.
హెచ్1బీ వీసాలపై పరిమితులు విధించాలని ట్రంప్ ప్రభుత్వం భావించడం లేదని... డేటా స్థానికీకరణ అడిగే దేశాలపై వీసాల విషయంలో ఎలాంటి ఆంక్షలకు ఇప్పట్లో తావు లేదని అమెరికా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
మనదేశంలోని అమెరికాకు చెందిన చెల్లింపుల కార్యాలయాలన్నీ ఇక్కడే తమ వినియోగదార్ల సమాచారాన్ని నిల్వ చేయడాన్ని భారత్ గతేడాది తప్పనిసరి చేసింది. అయితే అందుకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని కొన్ని యూఎస్ సంస్థలు ఆ నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి.
ఫలితంగా అమెరికా భారతీయ ఐటీ నిపుణులు వారి దేశంలో పనిచేయడానికి వీలు కల్పించే హెచ్1-బీ వీసాలపై పరిమితులు విధించాలని భావించినట్లు బుధవారం కొందరు ప్రతినిధులు మీడియాకు తెలిపారు. దీనిపై గురువారం ట్రంప్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.