అమెరికా లూసియానాలో పోలీసుల పొరపాటు.. హానీమూన్‌లో ఉన్న ఓ మహిళను 36 గంటల పాటు కటకటాలపాలయ్యేలా చేసింది. లూసీయానాలోని పొంచటౌలా ప్రాంతానికి చెందిన సారా సాసియర్ అనే మహిళ భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. తిరిగి వస్తోన్న సమయంలో అమెరికా కస్టమ్స్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. 2017 నవంబర్‌కు సంబంధించి లీజుకు తీసుకున్న వాహనాన్ని వెనక్కి ఇచ్చేయలేదన్న కేసులో అదుపులోకి తీసుకున్నారు.
అయితే కేసుకు సంబంధించిన మహిళను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటం, వారెంట్‌లో పుట్టిన తేదీని అధికారులు తప్పుగా నమోదు చేయడం ఈ పొరపాటుకు కారణమైంది. ఈ తప్పును గుర్తించడానికి వారికి 36 గంటలు పట్టింది. ఈ సమయంలో సారా... ఒర్లీన్స్ జైల్లో ఉంది. తాను చెప్పింది ఎవరూ వినిపించుకోలేదని విడుదలైన అనంతరం వాపోయింది.
"వారు తమ పొరపాటును గుర్తించి, నన్ను విడుదల చేస్తారని నేను అనుకున్నాను. ఒకానొక సందర్భంలో నా మాట ఎవ్వరూ వినలేదు. అమాయాకురాలిని అని చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడే ఉండిపోతానేమోనని భయపడ్డాను."-సారా సాసియర్, బాధితురాలు
అధికారుల క్షమాపణ
పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేసినందుకు జైలు అధికారి క్షమాపణలు తెలిపారు. 'ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని' స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నిర్భయకు న్యాయమేది? పేరుకేనా మరణ దండన?