గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న 'ఫ్లయింగ్ సాసర్లు' (యూఎఫ్‌ఓ)లు అప్పుడప్పుడూ భూమిని సందర్శించి వెళుతున్నాయా? అనాదిగా మనిషి బుర్రను తొలుస్తున్న ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా పరిశోధనాత్మక లఘు చిత్రాల దర్శకుడు జెరీమీ కార్బెల్ దీనిపై సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌ఓలు చుట్టుముట్టినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన రాడార్ తెర దృశ్యాలను ఆయన విడుదల చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. కాలిఫోర్నియాలోని శాన్ డియెగో తీరానికి చేరువలో 2019 జులైలో ఈ ఘటన జరిగిందని కార్బెల్ తెలిపారు. ఈ ఫుటేజీ వాస్తవమైనదేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. యూఎస్‌ఎస్ ఒమాహా అనే యుద్ధనౌకను 9 యూఎఫ్‌ఓలు చుట్టుముట్టాయని కార్బెల్ చెప్పారు. ఆయన విడుదల చేసిన రాడార్ చిత్రాల్లో అవి కనిపించాయి. అవి గంటకు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు కార్బెల్ తెలిపారు. ఒమాహా యుద్ధనౌక వేగంతో పోలిస్తే ఇది దాదాపు 3రెట్లు ఎక్కువ. ఆ తర్వాత రాడార్ తెరపై నుంచి అదృశ్యమైనట్లు వివరించారు. రాడార్ పరిధికి అందకుండా అవి వెళ్లిపోయి ఉంటాయని తెలిపారు. 'ఆకాశంలో చాలా ఎత్తుకు గానీ సముద్రంలోకి గానీ అవి చేరి ఉండొచ్చు' అని పేర్కొన్నారు. నౌకలోని కమాండ్ కేంద్రంలో ఈ వీడియోను చిత్రీకరించారని, ఈ ఫుటేజీని 'రహస్యమైనది'గా రక్షణశాఖ వర్గీకరించలేదన్నారు. ఈ నెల 15న కూడా యూఎఫ్‌ఓలకు సంబంధించిన ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. అందులో ఒక గోళాకార యూఎఫ్‌ఓ కనిపించింది. ఆ తర్వాత అది సముద్రంలో కలిసిపోయింది. ఈ వీడియో కూడా అధీకృతమైనదేనని రక్షణ శాఖ ధ్రువీకరించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇటీవల యూఎఫ్‌ఓల ప్రస్తావన చేశారు. తన హయాంలో వీటి గురించి ఆరా తీసినట్లు చెప్పారు. 'ఆకాశంలో కొన్ని గుర్తుతెలియని వస్తువులకు సంబంధించిన ఫుటేజీ, రికార్డులు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి... ఎక్కడికి వెళ్లాయన్నది మనకు తెలియదు' అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయడానికి అమెరికా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వచ్చే నెలలో తన నివేదికను విడుదల చేయనుంది. యూఎఫ్‌ఓలను గుర్తించే అంశంలో నౌకాదళ పైలట్లకు కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని అమెరికా నేవీ రెండేళ్ల కిందట తెలిపింది.
ఇదీ చూడండి: వచ్చే ఏడాది అమెరికా బడ్జెట్ 6 ట్రిలియన్ డాలర్లు