ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19 (కరోనా వైరస్) చిన్నారుల విషయంలో కాస్త కరుణ చూపుతున్నట్లు వెల్లడైంది. వీరిపై ఈ వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నట్లు స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం తేల్చింది.
కొవిడ్-19 కూడా సార్స్, ఎంఈఆర్‌ఎస్ తరహాలోనే వ్యాప్తి చెందుతున్నప్పటికీ తాజా మహమ్మారి వల్ల చోటుచేసుకుంటున్న మరణాల రేటు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రాణాపాయం కలిగించే స్థాయిలో ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తోందని చెప్పారు. ముఖ్యంగా.. వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటోందన్నారు. అయితే ఇన్‌ఫెక్షన్ లక్షణాలు చిన్నారుల్లో తక్కువగా ఉంటాయని వివరించారు.
నిజానికి పెద్దల తరహాలోనే పిల్లల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అయితే దీనివల్ల చిన్నారులు అనారోగ్యం పాలయ్యే అవకాశం తక్కువని చెప్పారు. వీరిలో తీవ్రస్థాయిలో వ్యాధి లక్షణాలు కనపడే అవకాశమూ తక్కువని వివరించారు. సార్స్, ఎంఈఆర్‌ఎస్‌ల విషయంలోనూ ఇలాగే జరిగిందని చెప్పారు. గత నెలలో చైనా నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అంశాలను గుర్తించారు శాస్త్రవేత్తలు.
ఇదీ చూడండి: లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు...