బుర్కినా ఫాసో దేశంలో భయంకరమైన దాడి జరిగింది. గుర్తుతెలియని సాయుధులు.. ఓ కెనడియన్ మైనింగ్ కంపెనీ సెమాఫో ఉద్యోగులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సిబ్బంది ప్రయాణిస్తున్న ఐదు బస్సులపై దాడి చేసి దారుణానికి ఒడిగట్టారు. ఇందులో సాధారణ సిబ్బంది, కాంట్రాక్టర్లు, సరఫరాదారులు ఉన్నట్లు తూర్పు ప్రాంత గవర్నర్ సైడౌ సనోవ్ వెల్లడించారు. బస్సులపై పేలుడు పదార్థాలు విసిరినట్లు.. మరికొందరిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యంత భయంకరమైన దాడిగా అభివర్ణించారు.
జిహాదీ తిరుగుబాటుదారులే...
తీవ్ర రాజకీయ సంక్షోభం, పేదరికంతో సతమతమవుతున్న ఈ పశ్చిమాఫ్రికా దేశంలో జిహాదీల తిరుగుబాటుతో 2015 నుంచి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి చేసిందీ వీరేనని భావిస్తున్నారు.
బుర్కినా ఫాసోలో రెండు మైనింగ్ కంపెనీలను నిర్వహిస్తోన్న కెనడా సంస్థ సెమాఫోపై గత 15 నెలల్లో ఇది మూడో ఘోరమైన దాడి కావడం గమనార్హం. గతేడాది ఆగస్టు, డిసెంబర్లోనూ ఇలాగే రెండు వాహన శ్రేణులపై జరిపిన వేర్వేరు దాడుల్లో 11 మంది గనుల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడులతో తమను బెదిరించలేరని.. ఇది తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని సంస్థ యాజమాన్యం స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: పిల్లిని చంపిన కిరాతకుడికి 34 నెలల జై
లు