పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ముష్కరులు రెచ్చిపోయారు. ఉత్తర బుర్కినా ఫాసోలోని అరబిందా పట్టణంలో వరుస దాడులకు పాల్పడ్డారు. పట్టణంలో తీవ్రవాదులు మంగళవారం చేసిన దాడిలో 35 మంది పౌరులు దుర్మరణం చెందారు. అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మార్క్ క్రిస్టియన్ కబోరే ట్విట్టర్లో తెలిపారు. వారికి నివాళిగా రెండు రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు. ఉగ్రదాడి మృతులలో 31 మంది మహిళలు ఉన్నట్లు దేశ సమాచార శాఖ మంత్రి స్పష్టం చేశారు.
పెద్ద ఎత్తున జిహాదీ తీవ్రవాదులు అరబిందాలోని సైనిక స్థావరాలు, సాధారణ పౌరులపై విచక్షణా రహితంగా వరుస దాడులకు పాల్పడిందని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉగ్రదాడి తర్వాత ముష్కరులను ఏరివేయడానికి భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టింది ఆ దేశ సైన్యం. అనంతరం 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఈ దాడిలో ఏడుగురు జవానులు సహా కొంతమంది పౌరులు మరణించినట్లు వెల్లడించింది. 20 మందికిపైగా సైనికులకు గాయాలయ్యాయి.
తాజా దాడులకు ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అయితే అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలే ఈ నరమేథానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.