మేడ్చల్ జిల్లాలో పట్టుబడ్డ రూ.2కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసులో(Medchal Mephedrone drug case) ఇంకా దొరకని నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హన్మంత్‌రెడ్డి ఇప్పటికే లొంగిపోయాడు. నిందితులుగా ఉన్న హన్మంత్‌రెడ్డి, రామకృష్ణ గౌడ్‌ను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ఈనెల 5న మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుల ఇళ్లతోపాటు మరో ఐదుగురి ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బావాజీపల్లి, నాగర్ కర్నూల్, చింతల్‌లో సోదాలు చేసినట్లు సమాచారం. ఈ కేసులో(Medchal Mephedrone drug case) మరో ప్రధాన నిందితుడు ఎస్కే రెడ్డి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అతడు పట్టుబడితే కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మాదక ద్రవ్యాల తయారీలో ఎస్కే రెడ్డి ప్రధానపాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇలా పట్టుబడింది..
మేడ్చల్ జిల్లాలో అక్టోబర్ 23న భారీ డ్రగ్ రాకెట్(Medchal Mephedrone drug case) బయటపడింది. రూ.2 కోట్ల విలువైన మెపిడ్రిన్ డ్రగ్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారినుంచి 4.92 కిలోల మెపిడ్రిన్‌తో పాటు కారును సీజ్ చేశారు. డ్రగ్స్ కేసులో పవన్, మహేశ్ రెడ్డి, రామకృష్ణ గౌడ్‌ను అరెస్ట్ చేయగా ప్రధాన నిందితులు ఎస్.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు ఉన్న పక్కా సమాచారం కూకట్‌పల్లిలో ఉంటున్న పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్‌లోని మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా 926 గ్రాముల మెపిడ్రిన్ బయటపడింది. మహేశ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్ వాసి అయిన రామకృష్ణగౌడ్ ఇంట్లో సోదాలు చేయగా తన కారులో 4 కిలోల మెపిడ్రిన్ దొరికిందని తెలిపారు. నిందితులను మీడియా ముందు ఎక్సైజ్ పోలీసులు హాజరు పరిచారు.
ముమ్మర దర్యాప్తు
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం బావాజిపల్లికి చెందిన హనుమంతరెడ్డి మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్కేఎస్ రెడ్డి సాయంతో బెంగళూర్, గోవా, ముంబయి నుంచి మెఫిడ్రిన్‌ను తీసుకొచ్చి.. నగరంలో పలువురికి హన్మంత్ రెడ్డి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్కేఎస్ రెడ్డి కోసం గాలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు... అతన్ని పట్టుకుంటే కీలక సమాచారం రావొచ్చని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఇళ్లతో పాటు అనుమానం ఉన్న అయిదు చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: