పనిచేసే కంపెనీలో చోరీకి పాల్పడ్డ ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి సాయపడ్డ మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని.. రూ. 16 లక్షల 59 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవర్‌పల్లి పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఇది జరిగింది.
కృష్ణా ఎంటర్ ప్రైజెస్ పేరుతో నడుస్తున్న బ్యాటరీ లెడ్ తయారీ కంపెనీలో.. మంచాల ప్రశాంత్ అకౌంటెంట్‌గా చేసేవాడు. ఈ నెల 8వ తేదీన.. యజమాని రూ. 22 లక్షలను డ్రాలో పెట్టిన విషయాన్ని గమనించిన ప్రబుద్ధుడు.. వాటిని దోచేందుకు పథకం వేశాడు. తన ఐదుగురి స్నేహితులను రంగంలోకి దింపాడు. సీసీ కెమెరాలను ఆఫ్ చేసి.. మిత్రులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు.
మరుసటి రోజు.. కంపెనీకి వచ్చిన యజమాని అభిషేక్.. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ చేపట్టి.. ఇంటి దొంగను పట్టుకున్నారు. అతనికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: ఈతకెళ్లి నీటమునిగిన ఇద్దరు విద్యార్థులు... ఒకరి మృతదేహం లభ్యం..