Man Killed Wife at Kesavapatnam జాతీయ జెండా సాక్షిగా భార్యను భర్త దారుణంగా హత్య చేసిన దారుణ సంఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్, కేశవపట్నం మండల కేంద్రానికి చెందిన శిరీష(30) 11 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. శిరీష నాలుగేళ్లుగా అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. శిరీష కేశవపట్నంలోనే ఉంటున్నారు. విడాకుల కోసం భర్తకు నోటీసులు పంపించారు.
సోమవారం అంగన్‌వాడీ కేంద్రం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణలో ఆమె పాల్గొన్నారు. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ప్రవీణ్ ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. జనం చూస్తుండగానే కత్తితో గొంతు కోయడంతో ఆమె సంఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచింది. కుమార్ అనే యువకుడు అడ్డుకోబోగా.. కత్తితో పొడవడంతో చిన్నగాయమైంది. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Man Committed Suicide in Maheshwaram మరోవైపు రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యకు వీడియో కాల్ చేసి ఆమె చూస్తుండగానే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీ బంధువుల వివాహాలకు నేను హాజరయ్యాను.. మా బంధువుల ఇంట్లో బోనాలకు నువ్వెందుకు రావడం లేదని’ భార్యపై అలిగిన భర్త ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
తుక్కుగూడలో ఉండే సాయి కార్తిక్‌గౌడ్(33), భార్యతో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి కందుకూరు మండలం బేగంపేట వెళ్లాడని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. పుట్టింటివాళ్లు కావడంతో భార్య అక్కడే ఉండిపోగా కార్తిక్‌గౌడ్ శనివారం ఇంటికి వచ్చాడని తెలిపారు. ఆదివారం మీర్‌పేటలో జరిగే బోనాల పండగకి తన పిన్ని ఇంటికి వెళ్దామని భార్యకు పదే పదే ఫోన్ చేశాడని చెప్పారు. ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుందన్నారు. మనస్తాపంతో సాయి కార్తిక్ రవళికి వీడియో కాల్ చేసి మీ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర విందులకు నేను హాజరవుతున్నా.. తమ వాళ్ల వద్దకు నీవెందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కార్తిక్‌గౌడ్ దూలానికి ఉరేసుకున్నాడని అన్నారు.
ఆ సమయంలో ఫోన్ పడేయడంతో దృశ్యాలు కానరాలేదని పోలీసులు తెలిపారు. వెంటనే భర్త వద్దకు బయలుదేరిన రవళి పక్కింటి వాళకు ఫోన్లు చేస్తూ భర్తను కాపాడాలని వేడుకుందని చెప్పారు. ఇంటికి చేరుకునేప్పటికే భర్త మృతి చెందడంతో ఆమె కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని సీఐ వెంకటేశ్వరు తెలియజేశారు.