"నాన్నా నన్ను క్షమించు.. ఎంతో ఊహించుకున్నా.. వీడు నన్ను మోసం చేశాడు.. భరించలేకపోతున్నా.. వెళ్లిపోతున్నా.." అంటూ తండ్రికి, "నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను క్షమించురా! పెళ్లి పేరుతో వాడు మోసం చేశాడు. ఇంకా రెండేళ్లు ఆగమంటున్నాడు.. నేను చనిపోతున్నా!" అంటూ సోదరుడికి సెల్ఫీ వీడియోలు పంపి ఓ యువతి తనువు చాలించింది. హైదరాబాద్ మీర్‌పేటకు చెందిన ఐశ్వర్య (20) అనే యువతికి మియాపూర్‌కు చెందిన మారెడ్డి అశిర్ (21) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో టెలికాలర్‌గా పనిచేసే అశిర్ స్నేహం, ప్రేమ పేరుతో ఐశ్వర్యకు దగ్గరయ్యాడు.
గతేడాది ఫిబ్రవరిలో పెద్దలకు తెలియకుండా ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. నెలపాటు ఖైరతాబాద్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఉన్నారు. అశిర్ ఉద్యోగం వదిలేయడమే కాకుండా యువతిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు వచ్చి వారిని మందలించారు. ముందుగా జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఆమె గర్భవతి అయినట్లు తెలుసుకున్న అశిర్ గర్భస్రావం చేయించాడు. దీంతో ఐశ్వర్య మరింత కుమిలిపోయింది. 20 రోజుల నుంచి ఆమె బంజారాహిల్స్‌లోని ఓ పేయింగ్ గెస్ట్‌హౌస్‌లో మరో ఇద్దరు యువతులతో కలిసి విడిగా ఉంటోంది.
ఐశ్వర్య ఆదివారం మియాపూర్‌లోని అశిర్ ఇంటికి వెళ్లింది. తమ విషయం తేల్చాలంటూ అతడి తల్లిని నిలదీసింది. మరో రెండేళ్లపాటు ఆగాలని ఆమె తేల్చిచెప్పారు. నొచ్చుకున్న ఐశ్వర్య పెయింగ్ గెస్ట్‌హౌస్‌కు వచ్చి సోమవారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో తండ్రికి, సోదరుడికి, భర్త అశిర్‌కు వేర్వేరుగా సెల్ఫీ వీడియోలు రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంది. అది చూసిన ఆయన వెంటనే ఆమెతోపాటు అద్దెకుండే యువతికి ఫోన్ చేసి చెప్పాడు. బయట ఉన్న ఆమె గదికి వెళ్లి చూసేసరికి ఐశ్వర్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
ఇదీ చూడండి : ఉన్నతాధికారుల పీఏనంటూ మోసాలు: సీపీ అంజనీకుమార్