Gattu SI Phone Audio Viral: జోగులంబ గద్వాల జిల్లా గట్టు ఎస్సై మంజునాథ్‌రెడ్డి ఫోన్ సంభాషణ చర్చనీయాంశమైంది. గట్టు మండలం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న ఎస్సై మంజునాథ్‌రెడ్డి.. ఓ వ్యక్తితో ఫోన్లో లంచం గురించి మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది కాస్తా.. పోలీస్ ఉన్నతాధికారులకు చేరటంతో ఎస్సైపై విచారణకు ఆదేశించారు. ఈ ఫోన్ సంభాషణతో పాటు ఎస్సైపై ఇప్పటికే ఉన్న ఇసుక, మట్కా దందాల అవినీతి ఆరోపణలపై కూడా విచారణ మొదలుపెట్టారు.
ఫోన్ సంభాషణలో ఏముందంటే..
ఎస్సై మంజునాథ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేయగానే.. అటువైపు తెలిసిన వ్యక్తి అన్నట్టు ఎస్సై స్పందించాడు. "చాలా సేపటి నుంచి మారెప్ప మీకోసం ఎదురుచూస్తున్నాడు సర్" అనగానే "ఎందుకంటా..?" అని ఎస్సై ప్రశ్న. అదే సార్ వేసుకుంటాడంటా అంటూ.. అసలు పని గురించి సంబోధించకుండా విషయాన్ని ఎస్సైకి తెలియజేశాడు.. అవతలి వ్యక్తి. "అందరికి మాట్లాడేశాడంటా.. మీతో మాట్లాడదామంటే మీరు బిజీగా ఉన్నారు" అన్నాడు. దానికి స్పందిస్తూ.. ఒక్కసారిగా "50 వేలు కావాలని చెప్పు" అని ఎస్సై డిమాండ్. "40 ఇస్తాడంట సార్.." అంటూ వెంటనే వినమ్రతతో కూడిన బదులు. 40 వేలను పై ఆఫీసర్లకు ఎలా ఇచ్చుకోవాలంటూ ఎస్సై నిట్టూర్పు. "మీరే కొంచెం చూడండి సార్" అని బతిమాలుతూ ఎదుటి వ్యక్తి అడగ్గానే.. "ఎవరైన కంప్లైంట్ ఇస్తే మాత్రం తీసుకొచ్చేస్తా.." అన్నాడు ఎస్సై ఒప్పుకున్నట్టుగా... ఇలా సాగింది వాళ్ల ఫోన్ సంభాషణ.
ఈ సంభాషణ అంతా మట్కా స్థావరం ఏర్పాటు గురించి అని తెలుస్తోంది. రోడ్డుపైన ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తారు.. స్కూల్ వెనకాల వేసుకోవాలంటూ.. ఓ మట్కా స్థావరం గురించి ఎస్సై సలహా ఇవ్వటం కొసమెరుపు. గట్టు మండలంలో జరిగే పలు మాఫియాల్లో ఇప్పటికే ఎస్సై మంజునాథ్ అవినీతి ఆరోపణలున్నాయని గ్రామస్థులు తెలిపారు. గట్టు ప్రాంతంలో ఇసుక, మట్టి తవ్వే ప్రతి వ్యక్తి పోలీసులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేదంటే పై అధికారులు ఒప్పుకోరు అంటూ ఎస్సై బెదిరిస్తారని గ్రామస్థులు ఆరోపించారు. ఎస్సై మంజునాథ్‌రెడ్డి అవినీతి ఆరోపణల విషయంలో దర్యాప్తు ప్రారంభమైందని.. విచారణకు వచ్చిన గద్వాల సీఐ ఎస్ఎం భాషా తెలిపారు. ఎస్సైపై ఉన్న గట్టు జాతర, గేమింగ్, ఇసుక మాఫియా తదితర అంశాలపై ఆరతీస్తున్నామని.. పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్టు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి: