హైదరాబాద్ శివారులోని దూలపల్లి అటవీ ప్రాంతంలో చెలరేగిన అగ్నిప్రమాద తీవ్రతకు... పచ్చని చెట్లు బూడిదయ్యాయి. ఊహించని విధంగా పెద్దఎత్తున ఎగిసిపడ్డ అగ్నికీలలు... 25 ఎకరాల్లోని వనసంపదను హరించాయి. ఘటనాస్థలికి దగ్గర్లోనే ఉన్న ఫారెస్ట్ అకాడమీ సిబ్బంది, అధికారులు అప్రమత్తమై అగ్నిమాక యంత్రాంగంతో సమన్వయం చేసుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానికుల సహాయంతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మిగతా ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
ఆకతాయిల పనే ఇది..
అటవీ చుట్టూ కంచె లేదని... గుర్తు తెలియని ఆకతాయిలు వచ్చి ఎండుటాకులకు నిప్పు పెట్టి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అటవీ ప్రాంతం చుట్టూ ప్రహరీ సక్రమంగా లేకే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు... అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే అడవి చుట్టూ ప్రహరీ ఎత్తును పెంచి కంచె ఏర్పాటుచేస్తామని అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెమళ్లు, కుందేళ్లకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతంలోకి వచ్చే ఆకతాయిలపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
ఇదీ చూడండి: రక్షణ కల్పిస్తారు.. అవగాహన కోసం వీడియోలు రూపొందిస్తారు..