ఫోర్జరీ సంతకాలు, ధ్రువపత్రాలు తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న అభియోగంపై జానకీ ఆగ్రో (Janaki agro) కంపెనీపై సీబీఐ కేసు (CBI case) నమోదు చేసింది. కెనరా బ్యాంకులో విలీనమైన సిండికేట్ బ్యాంకు నుంచి మాదాపూర్లోని జానకి ఆగ్రో సుమారు 3 కోట్ల 44 లక్షల రూపాయలను ఆగ్రో కంపెనీ పేరిట రుణం తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. కొండాపూర్లోని 2 వేల 662 గజాల భూమిని కంపెనీ భాగస్వామి కానా విజయలక్ష్మి తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత రుణాలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఆ భూమిని వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ భూమి కానా విజయలక్ష్మిదే కానీ.. తమకు తనఖా పెట్టిన మహిళ పద్దపాటి పద్మావతి అని బ్యాంకు అధికారులు గుర్తించారు.
తానే విజయలక్ష్మినని ఫోర్జరీ సంతకాలు చేసి మోసానికి పాల్పడినట్లు బ్యాంకు విచారణలో తేలింది. జానకీ ఆగ్రోస్ (Janaki agro) యజమాని రాంజీ, సంతోష్ యాదవ్ అనే మరో వ్యక్తి సహకారంతో మోసం చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. విలువ నిర్ధారణ ధ్రువపత్రాలు కూడా ఫోర్జరీవి సమర్పించినట్లు గ్రహించారు. కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Krishna Water: 'కృష్ణా బేసిన్లో నీరు వినియోగించుకునేలా మార్పు చేయండి'