అతనికి మతిస్తిమితం సరిగా లేదు. ఆపై అనారోగ్యం. దీంతో తాను తన తల్లి, సోదరి శవాలతో సహవాసం చేస్తున్నానని గుర్తించలేకపోయాడు. చుట్టుపక్కలవారు అనుమానంతో ఇంట్లోకి వస్తే తప్ప ఈ విషయం బయటపడలేదు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాంటేక్‌లో ఈ హృదయవిదారక ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే...
రాంటేక్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (75)కి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరిధర్(58) మినహా మిగతా వారందరికీ వివాహాలయ్యాయి. గిరిధర్‌కు మతిస్తిమితం సరిగా లేకపోవడంతో తల్లితోనే ఉంటున్నాడు. లక్ష్మీబాయి సుమారు పది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. ఆ విషయం తెలిసిన కుమార్తె భారతిబాయి (55) సపర్యలు చేసేందుకు వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో తల్లి, కుమార్తె, కుమారుడు ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. స్థానిక వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నారు. నాలుగైదు రోజులుగా ఇంటి వద్ద అలికిడి వినిపించలేదు. పైగా దుర్వాసన వస్తుండటంతో ఆదివారం సమీపంలోని ఇళ్లవారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లిచూడగా ముగ్గురూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భైంసా ఏఎస్పీ కిరణ్‌ఖారె ప్రభాకర్, ముథోల్ సీఐ అజయ్‌బాబు, తానూరు ఎస్సై రాజన్న ఘటనాస్థలికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కుమార్తె చనిపోయి ఉండగా.. వారి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. గిరిధర్ ప్రాణాలతో ఉన్నాడు.
కరోనాయే కారణమా?
ముగ్గురి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు. వారు కరోనా బారిన పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా వైద్యం పొందినా నయం కాకపోవటం, శరీరం నీరసంగా మారడంతో ఇంట్లోనే ఉండిపోయారు. తల్లి, కుమార్తె పరిస్థితి విషమించి చనిపోగా.. కుమారుడికి వాసన రాక ఈ విషయం గుర్తించలేదని తెలుస్తోంది. ఇద్దరు సుమారు వారం రోజుల క్రితం మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో మృతదేహాలను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు ముందుకు రాలేదు. మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండటంతో ఖానాపూర్‌కు చెందిన వైద్యాధికారిని పిలిపించి అక్కడే పోస్టుమార్టం చేయించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అనుమానాస్పద స్థితి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.