పొరుగింటి వారితో గొడవలు, అవమానభారం ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. యాదాద్రి జిల్లా రాజంపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి, అక్షిత దంపతులు.. ఇద్దరు పిల్లలతో కలిసి.... కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వెస్ట్ గాంధీనగర్లో నివాసముంటున్నారు. భిక్షపతి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భిక్షపతి.. బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. రాజంపేట నుంచి అతని సోదరుడు ఇంటికి వచ్చేలోపు భిక్షపతితోపాటు అతడి భార్య, పిల్లలు విగతజీవులై పడిఉన్నారు. ముందుగా భార్యా, పిల్లల్ని చంపి ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనా స్థలం నుంచి పోలీసులు బలవన్మరణానికి సంబంధించిన లేఖ స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి ఐదుగురు వ్యక్తులు కారణమని.. అకారణంగా లేనిపోని నిందలు వేయడంతోపాటు... దాడి చేశారని లేఖలో భిక్షపతి పేర్కొన్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి భిక్షపతిపై పక్కింటి వాళ్లు దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భిక్షపతి పక్కింట్లో ఓ మహిళ తన పదిహేనేళ్ల కుమార్తెతో నివాసం ఉంటోంది. బాలికను లొంగదీసుకొని తరుచూ లైంగికదాడి చేశాడని... మహిళ, ఆమె బంధువులు రాత్రి భిక్షపతిపై దాడికి దిగినట్లు సమాచారం. భిక్షపతి ఆటోను కూడా ధ్వంసం చేశారు. బాలిక విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెడతామని మహిళ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆందోళనకు గురైన భిక్షపతి భార్యాపిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాలను శవపరీక్ష కోసం తీసుకెళ్తుండగా మృతుల బంధువులు అడ్డుకున్నారు. మరణాలపై అనుమానాలున్నాయని.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. న్యాయం జరిగేలా చూస్తామన్న పోలీసుల హామీతో వారు ఆందోళన విరమించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక... మరింత విచారణ చేసి.. పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.