తెరాసలో జెండా మోసిన వారికి విలువ లేదని... మధ్యలో వచ్చిన ఉద్యమ ద్రోహులకే సముచిత స్థానం కల్పిస్తున్నారని వరంగల్ మహానగర పాలక సంస్థ 37వ డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాస పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి సాంబయ్య రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాను ఎనలేని సేవ చేశానని... ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని, రైలు రోకోలో పాల్గొనన్నాని సాంబయ్య వివరించారు.
పార్టీకి వరంగల్ జిల్లాలో ఆర్ధికంగా కూడా సేవ చేశానని తెలిపిన సాంబయ్య... తనకు అన్ని విధాలా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే... అది ఒక సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమేనని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్లో అభివృద్ధి ఏ మాత్రం లేదన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రధాని మోదీ పాలన చూసి భాజపాలో చేరుతున్నానని తెలిపారు. రానున్న రోజుల్లో తెరాస పార్టీని ప్రజలు ఆదరించరని సాంబయ్య తెలిపారు.