యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడికి రుద్రమ కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా చదువుకున్న వాళ్లు ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొనడం లేదని రుద్రమ అభిప్రాయపడ్డారు . ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ 55 శాతం మించడం లేదని తెలిపారు. పట్టభద్రులందరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు న్యాయం జరగాలన్నా, అభివృద్ధి ప్రజలకు చేరువ అవ్వాలన్నా పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో పాల్గొవాలని రాణి రుద్రమ పిలుపునిచ్చారు. తనని గెలిపిస్తే ప్రజలకు, నిరుద్యోగులకు, అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: 'అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానమే చెబుతుంది'