పట్టుదల, నిబద్ధత ఉంటే అనుకున్నది సాధించగలమని నిరూపించారు బిందు, అనురాధ, నందిత. అమ్మాయిలుగా.. వారు కన్న కలలను సాకారం చేసుకోవడానికి, అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ ప్రయాణం ఆపలేదు. ఎవరైనా సరే.. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే అనుకున్నది సాధించగలరని చూపించారు.
ఏం చేసినా అవగాహనతోపాటు ఆసక్తీ ఉండాలంటోంది నందిత బన్నా. శుక్రవారం జరిగిన మిస్ సింగపూర్ పోటీల్లో విజేతగా నిలిచింది తను. త్వరలో మిస్ యూనివర్స్ పోటీల్లో సింగపూర్ తరఫున బరిలోకి దిగనున్న నందిత అచ్చ తెలుగమ్మాయి. అక్కడే పుట్టి, పెరిగినా మేం తెలుగువాళ్లమేనంటూ తన విశేషాలను పంచుకుంది...
సింగపూర్‌లో గెలిచిన తెలుగందం!
అందాల పోటీలంటే ఒకప్పుడు బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యముండేది. కానీ ఇప్పుడు న్యాయనిర్ణేతలు పరిశీలించే తీరులో మార్పొచ్చింది. ఎన్నో అంశాలపై పూర్తి అవగాహన, ఆసక్తి రెండూ ఉండాలి. అప్పుడే చేసే పని, చెప్పే మాటలో సహజత్వం ఉంటుంది. ఈ తీరే నన్ను మిస్ సింగపూర్‌గా నిలిపింది. నా పూర్తి పేరు బన్నా ప్రభాక్రాంతి నందిత. మాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. అమ్మ ఫణిమాధురి, నాన్న గోవర్ధనరావు, ఇద్దరూ సివిల్ ఇంజినీర్లే. పాతికేళ్ల క్రితమే సింగపూర్‌లో స్థిరపడ్డారు. నాకో తమ్ముడు. నేను పుట్టిందీ, పెరిగిందీ సింగపూర్‌లోనే. స్కూల్లో ఆంగ్లం మాట్లాడినా ఇంట్లో అందరం చక్కగా తెలుగే మాట్లాడతాం.
సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో డబుల్ డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నా. హైస్కూలు నుంచి ఫ్యాషన్ రంగమంటే ఇష్టం. స్టూడెంట్ డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, స్కూల్ క్లబ్, భారతీయ సాంస్కృతిక బృందాలతో కలిసి పని చేయడంతో మోడలింగ్‌పై ఆసక్తి కలిగింది. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. స్కూలు నుంచి కాలేజ్ స్థాయి వరకు నావన్నీ మంచి గ్రేడ్‌లే. సాంకేతికత అన్నా మక్కువే. డేటాసైన్స్, పైథాన్, మెషింగ్ లర్నింగ్ కోర్సులను పూర్తిచేశా. సేవా కార్యక్రమాలన్నా ఆసక్తే. పేద పిల్లలకు దాతల నుంచి వస్తువులను సేకరించి అందిస్తా. దీన్ని హైస్కూల్ నుంచి నిర్వహిస్తున్నా. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ పాల్గొంటా. ఒంటరి తల్లులు ఇక్కడ దృష్టి పెట్టాల్సిన అంశం. వీరి స్థితిగతుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మా బృందం సింగపూర్ ప్రభుత్వానికి అందిస్తోంది. వీటి ఆధారంగా పార్లమెంట్‌లో చర్చించారు కూడా. ‘కేర్ కార్నర్ సింగపూర్’లో వలంటీర్‌ని. ప్రైమరీ స్కూలు విద్యార్థులకు మెంటార్‌ని కూడా. వారికి ఇంటర్ పర్సనల్, లైఫ్‌స్కిల్స్‌లో శిక్షణనిస్తుంటా. ఫ్యాషన్ రంగంలోనే స్థిరపడాలన్న నియమాన్నీ పెట్టుకోలేదు. ఇప్పుడైతే విద్య, ఫ్యాషన్ రెంటికీ సమ ప్రాధాన్యమిస్తున్నా. మిస్ యూనివర్స్ పోటీలు ఈ డిసెంబర్‌లో ఇజ్రాయెల్‌లో జరుగనున్నాయి. వాటికీ సిద్ధమవుతున్నా. అక్కడా విజయం సాధించేందుకు శ్రమిస్తా.
రోడ్డేస్తేనే పెళ్లి!
70 ఏళ్లుగా ఎవరూ చేయలేని పనిని ఓ ఆడపిల్ల చేసింది. ఇందుకు తన పెళ్లినే వాయిదా వేసుకుంది... ముఖ్యమంత్రినీ కదిలించింది. అనుకున్నది సాధించిన బిందు వాళ్ల కష్టాల్ని పంచుకుందిలా...
మాది కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు 37కి.మీల దూరంలోని హెచ్.రాంపుర. ఊళ్లో 60 కుటుంబాలు, జనాభా మూడొందలకు మించదు. మా ఊరి పిల్లను చేసుకోవాలన్నా, మా ఊరికి ఆడపిల్లను ఇవ్వాలన్నా భయం. కారణం రోడ్డే. తాతలకాలం నుంచీ మాకు మట్టిరోడ్డే తెలుసు. దీని వల్లనే నా స్నేహితురాళ్లలో చాలామంది పెళ్లిచూపులకే పరిమితమయ్యారు. బయట ఊళ్లకు వెళ్లిన వాళ్లు సాయంత్రం 6లోపు ఇంటికి చేరాల్సిందే. కారణం వన్యమృగాలే కాదు గుంతల రోడ్డులో పడితే ఆస్పత్రే గతి. ఈ భయంతోనే నన్ను బడికి వద్దన్నారు. మా ఊళ్లో ఐదు వరకే ఉంది. ఆపై చదువుల కోసం మరో ఊరికి వెళ్లాలి. నేను పట్టుబట్టడంతో హాస్టల్‌లో ఉంచి చదివించారు. అలా దావణగెరె విశ్వవిద్యాలయంలో ఎకానమిక్స్‌లో పీజీ చేశా. నాతో పాటు ఆరో తరగతిలో చేరిన మా ఊరి ఆడపిల్లల్లో ఒక్కరూ పది దాటలేదు. ఎంత మంది నాయకులకు మా కష్టాలను చెప్పినా, హామీలే తప్ప పరిష్కారం దొరకలేదు.
నేనే అడగగలను... నాకు పెళ్లి కుదిరింది. చదువుకున్న నేను కూడా నా దారి నేను చూసుకుని వెళ్తే ఊరి పరిస్థితి మారదని తెలుసు. అందుకే పెళ్లి వాయిదా వేసుకున్నా. గతేడాది రోడ్డు కోసం జిల్లా చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశా. లేఖకు సమాధానం వచ్చినా తారు రోడ్డుకు నిధులు రాలేదు. ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. కొత్త సీఎం బసవరాజ బొమ్మై మా పక్క జిల్లా వాసి అని తెలిసి ఆయనకు ఈనెల 13న మెయిల్ పెట్టా. ప్రధాని కార్యాలయానికీ కాపీ పెట్టా. మా బాధలన్నీ చెప్పా. నాకు పెళ్లి కుదిరింది. కానీ మిగిలిన ఆడపిల్లల పరిస్థితి ఏంటి? రోడ్డు వేసేదాకా పెళ్లే చేసుకోనని తెగేసి చెప్పా. ఈ మెయిల్ చూసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ‘మీ ఊరికి త్వరలో అధికారుల బృందం వస్తుంద’ని సమాధానం పంపారు. అన్నట్టుగానే 16న జిల్లా అధికారి మహంతేశ్ ఇంజినీర్ల బృందంతో మా ఊరికొచ్చిన తర్వాత రోడ్డు పనులు మొదలయ్యాయి. సోమవారం నుంచి బస్సు, త్వరలో తారురోడ్డు వేస్తామన్నారు. నా పెళ్లి కూడా చేస్తామని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే... మా ఊరి, అమ్మాయిల పెళ్లిళ్ల కష్టాలు తప్పాయి.
ఉద్యోగం వచ్చాక నాన్నకు బైక్ కొన్నా!
తండ్రి ఎమ్మెల్యే అయినా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలోనే చదివారామె. విద్యార్థి నేతగా ఉద్యమాలు చేస్తూనే.. లా చేశారు. చిన్న వయసులోనే న్యాయకళాశాల ప్రిన్సిపల్ అయి వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో రికార్డు సాధించారు. తెలుగునాట ఇలా ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగానూ ప్రత్యేకతని సాధించిన గుమ్మడి అనూరాధ వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకున్నారు...
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులగూడెం. మూడో తరగతి వరకు మా ఊళ్లో, ఆపై ఇంటర్ వరకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివా. మా సామాజిక వర్గంలో పెద్ద చదువులు తక్కువ. అందుకే ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించే వారు. బాగా చదువుకుంటే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని చెప్పేవారు. ఆ మాటలు నాలో బలంగా నాటుకున్నాయి. నాన్న గుమ్మడి నర్సయ్య. ఇల్లెందు నియోజకవర్గానికి ఐదు సార్లు ఎమ్మెల్యే. మేం నలుగురం. నేను చిన్న దాన్ని. రాజకీయాల్లో నాన్న బిజీ. ఆయన మాతో గడపడం లేదన్న లోటుతెలియకుండా అమ్మ చూసుకునేది. తనే వ్యవసాయం చేసేది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో కూడా మమ్మల్నేమీ ప్రత్యేకంగా చూసేవారు కాదు. నాన్న స్ఫూర్తితో సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారినై ప్రజల సమస్యలు పరిష్కరించవచ్చనుకున్నా. కానీ గణితంపై ఆసక్తితో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీలో చేరా. ఇమడలేక రెసిడెన్షియల్ స్కూల్‌లోనే చేరా.
అ‘లా’... నాన్నకు నన్ను లాయర్, అక్కను డాక్టర్ చేయాలనుండేది. అందుకే 2006లో ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీలో చేరా. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే లా చదివాను. సివిల్స్ రెండుసార్లు రాసినా రాలేదు. బషీర్‌బాగ్ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం చేశా. ఎమ్మే ఫిలాసఫీ కూడా చదివా. 2017లో పీహెచ్‌డీలో పూర్తి చేయగానే వర్సిటీలోని లా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాతే నాన్నకు ద్విచక్ర వాహనం, కారు కొనిచ్చాను. ఆయనకంటూ ఆస్తులేవీ లేవన్న ఉద్దేశంతో ఇల్లు కొన్నా. కానీ ఆయన మాత్రం సొంతూరిలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
ఉద్యమాల్లోనూ...
"నేను ఇంటర్‌లో ఉండగా మా పాఠశాలలో 5వ తరగతి అమ్మాయికి జ్వరం వచ్చింది. వైద్య నిర్లక్ష్యం కారణంగా ఆ పిల్ల చనిపోయింది. తోటి విద్యార్థులతో కలిసి ఆ బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్యమం చేసి సఫలీకృతులమయ్యాం. డిగ్రీలో నన్ను పీడీఎస్‌యూ కమిటీలోకి తీసుకున్నారు. అటు ఉద్యమాలు.. ఇటు చదువు... కష్టమయ్యేది. చదువుపై దృష్టి పెట్టలేకపోయాను. నాన్నకు చెబితే సమన్వయం చేసుకో అన్నారే కానీ ఉద్యమాలొద్దని చెప్పలేదు. పీడీఎస్‌యూలో ఓయూ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశాను. నేను చదువుకున్న కాలేజీకే ప్రిన్సిపాల్‌గా రావడం సంతోషంగా ఉంది."
- గుమ్మడి అనూరాధ
- ఇదీ చదవండి : ఆ పుస్తకం మహేశ్‌బాబును సిగరెట్ మాన్పించిందట!