రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ అప్పీలెట్ సంస్థను వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఛైర్మన్ నియామకం కోసం హైకోర్టు ప్రతిపాదించిన పేర్లు అందాయని ఏజీ తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరారు. నాలుగు వారాలు అవసరం లేదని.. రెండు రోజుల్లో పూర్తి చేయాలని ధర్మాసనం పేర్కొంది. కనీసం వారం రోజులు గడువు ఇవ్వాలని ఏజీ కోరగా... హైకోర్టు అంగీకరించింది. వారం రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ ఈనెల 14కి వాయిదా వేసింది.