తెలంగాణ పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి... భారత పశువైద్య మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల సంచాలకులు, కమిషనర్లకు చోటు దక్కగా... దక్షిణ భారత్ నుంచి లక్ష్మారెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం, పశుసంవర్థక శాఖ, రైతులకు చేసిన సేవలకు గుర్తింపుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రికి సిఫార్సు చేశారు. అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
వంగాల లక్ష్మారెడ్డి... పశుసంవర్థక శాఖలో 33 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. 1987లో అసిస్టెంట్ సర్జన్‌గా చేరి వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన... 23 సార్లు ఉత్తమ అధికారిగా ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్నారు. ప్రత్యేక రాష్ట్రావిర్భావం తర్వాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం విజయవంతం కావడానికి విశేష కృషి చేశారు. తనను నియమించినందుకు లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తనకు దక్కిన అరుదైన గౌరవాన్ని సద్వినియోగం చేసుకొని రైతులకు, పశువైద్య రంగానికి మరింత సేవ చేసి నూతన ఒరవడి తీసుకువస్తానన్నారు. ఈ సందర్భంగా పశువైద్య అధికారులు, సిబ్బంది లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: సచివాలయ పనులు వేగవంతం.. భారీ చెట్ల తొలగింపు