భారతీయులు స్థిరపడిన దేశాల్లో వారి పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయా(కేవీ)లను నెలకొల్పాల్సిన అవసరం ఉందని విద్యపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తద్వారా కేవీలకు ఉన్న బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ కమిటీ దేశంలోని పలు రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం పాఠశాల, ఉన్నత విద్యపై వేర్వేరుగా పలు సిఫార్సులతో నివేదికలను ఇటీవల పార్లమెంట్‌లో సమర్పించింది. కేవీలకు రూ.2,265.44 కోట్లు కోత విధించడంతో విద్యాసంస్థల వృద్ధిపై ప్రభావం పడుతుందని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న విద్యాలయాల భవనాలను బహుళ అంతస్తులుగా మారిస్తే మరిన్ని సీట్లు పెంచుకోవచ్చని పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో 2019 మార్చిలో 50 కేవీలను మంజూరు చేయగా ఇంకా 19 ప్రారంభం కాలేదని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న కేవీలు: 1245
తెలంగాణలో:35
కేవీల్లో ఉపాధ్యాయ ఖాళీలు: 8,420
మొత్తం జవహర్ నవోదయ విద్యాలయాలు: 632
వీటిలో ఉపాధ్యాయ ఖాళీలు: 3,205
ముఖ్యమైన సిఫార్సులు..
- దేశవ్యాప్తంగా 2045 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను 12వ తరగతి వరకు ఉన్నతీకరించాలి. దానివల్ల బాలికలు చదువు మానేయకుండా ఉంటారు. తెలంగాణలో మొత్తం 475 కేజీబీవీలు ఉండగా, వాటిలో 172 విద్యాలయాల్లోనే ఇంటర్ వరకు బోధన ఉంది. పలు చోట్ల భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు.
- పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మందకొడిగా సాగుతోంది. పిల్లల భద్రతకు ప్రహరీలు ఎంతో ముఖ్యం. వాటిని ఫాస్ట్ ట్రాక్ కింద పూర్తిచేయాలి.
- యువతను అధ్యాపక వృత్తి వైపు ఆకర్షించడంలో ఇప్పుడున్న విధానం విఫలమైంది. జాతీయ అర్హత పరీక్ష(నెట్) రూపు మార్చి కొత్త విధానాన్ని రూపొందించాలి.
- ప్రస్తుతం 2.5శాతం కళాశాలలు/వర్సిటీల్లోనే పీహెచ్‌డీ కోర్సు ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న వారిలో 0.5 శాతమే పీహెచ్‌డీ కోర్సుల్లో చేరుతున్నారు. పరిశోధనకు ఉన్న అవరోధాలను తొలగించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- కళాశాలలు, వర్సిటీల్లో అధ్యాపకుల కొరత రాకుండా పోస్టు ఖాళీ అయ్యే ముందుగానే నియామక ప్రక్రియ ప్రారంభించాలి. కన్సల్టెన్సీ ప్రాజెక్టులు చేపట్టేలా యువ అధ్యాపకులను ప్రోత్సహించాలి. వారికి స్టార్టప్ గ్రాంట్ ఇవ్వాలి.
- ఇదీ చూడండి : గురుకులాల్లో సవాలుగా మారిన భౌతిక దూరం సమస్య