Congress Operation Akarsh : రాష్ట్ర కాంగ్రెస్‌లోకి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తెరాస, భాజపాల నుంచి నేతలను చేర్చుకుంటున్నారు. ఐతే చేరికలపై నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని ఊహించి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా ఈ కమిటీకి సంబంధం లేకుండానే ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటున్నారు. ఏ ఒక్కరికీ కూడా కమిటీ ఆమోద ముద్ర లేకుండానే ఆహ్వానం పలుకుతున్నారు. పీసీసీ వ్యవహరిస్తున్న తీరును కొందరు సీనియర్ నాయకులు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వానికి కొరత లేదని, ఉన్న వారికే అవకాశాలు ఇస్తే బలమైనవారిగా తయారవుతారని అభిప్రాయపడుతున్నారు.
Operation Akarsh in congress : వారం రోజుల్లో తెరాస, భాజపాల నుంచి నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఆదిలాబాద్‌కు చెందిన జడ్పీఛైర్మన్, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే హస్తం గూటికి వచ్చారు. అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెంది మరొక జడ్పీ ఛైర్మన్ చేరికకు రంగం సిద్ధమైంది. మూడు రోజుల కిందట ఖైరతాబాద్ తెరాస కార్పొరేటర్ విజయారెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Telangana Congress Dispute : మెట్‌పల్లి జడ్పీటీసీ రాధ శ్రీనివాస్ రెడ్డి, సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు శ్రీనివాస్, మాజీ మంత్రి బోడ జనార్దన్‌లను రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన తుంగతుర్తికి చెందిన నాయకుడు వడ్డే రవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. మంచిర్యాలకు చెందిన పలువురు నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఒకే రోజు ముగ్గురు నాయకులు, హైదరాబాద్‌లోనే ఉండి వేర్వేరుగా పార్టీలకు వివిధ నాయకులు ఆహ్వానించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు సమక్షంలో కాకుండా బయట ఎలా పార్టీలో చేర్చుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముగ్గురు నాయకులు కలిసికట్టుగా చేరికలు ఆహ్వానిస్తే పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగేది అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జడ్చర్ల కు చెందిన యువ నాయకుడు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సుముఖంగా ఉండగా.... పీసీసీ స్థాయిలో ఆయన్ను చేర్చుకోవడానికి సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన్ని చేర్చుకుంటే తాను భాజపాలోకి వెళ్తానని ఒక ఎంపీ పీసీసీకి అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఈ విషయంలో కొంత ఆచితూచీ ముందుకెళ్లాలని... పీసీసీ భావిస్తోంది. ఇలా ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా చేరికల కమిటీలో చర్చించి ముందుకెళ్తే బాగుంటుందనే కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.