ఆర్టీసీ నిర్వహణలో మరో 30 హేవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని... ఈ మేరకు ఇప్పటికే సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు.
బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో మంత్రిని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ప్రత్యేక అధికారిణి విజేంద్ర, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్‌ఎం రావులతో పాటు పలువురు అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆ సేవల ద్వారా మరింత చేరువయ్యాం
ఏడాది కాలంలో విజయవంతంగా పూర్తి చేసిన కార్యక్రమాలను అధికారులు మంత్రికి వివరించారు. ఆర్టీసీ, రవాణా శాఖల అభ్యున్నతి కోసం తగిన కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణికుల సేవలో మెరుగైన పనితీరు కనబరుస్తూ ఆదరాభిమానాలను చూరగొంటున్న ఆర్టీసీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు.
అధికారులు, ఉద్యోగులకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్గో, పార్శిల్, కొరియర్ సేవల ద్వారా వినియోగదారులకు చేరువై... సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సమష్టి కృషి చేయాలన్నారు.
ప్రజల నుంచి స్పందన వస్తోంది
డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంపొందించడానికి హకీంపేట, వరంగల్‌లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీల వద్ద నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతోందని తెలిపారు. శిక్షణా కార్యకలాపాలను వికేంద్రీకరించడానికి మరో 30 హెవీ మోటారు వాహన డ్రైవింగ్ శిక్షణా సంస్థలను రెవెన్యూ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన ఏర్పడుతుందన్నారు. కొవిడ్ సమయంలో వజ్ర బస్సులను ఖమ్మం జిల్లాలో కరోనా శాంపిల్స్ పరీక్షల కోసం వినియోగంలోకి తీసుకురావడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.
సేవల్ని ఆన్‌లైన్ చేశాం
ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పువ్వాడ చెప్పారు. రవాణా శాఖలో పౌర సేవల్ని మరింత మెరుగుపర్చామని... ఈ క్రమంలోనే ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సేవలు పొందే విధంగా ఆన్‌లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా రవాణా కార్యాలయంలో డ్రైవింగ్ సిమ్యులేటర్‌ను ఏర్పాటు చేయడమే కాక వినియోగదారులు కార్యాలయాలకు రాకుండా... అనేక సేవల్ని ఇప్పటికే ఆన్‌లైన్ చేశామన్నారు.