సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో కేటీఆర్‌తో సమావేశమైంది. సింగపూర్, తెలంగాణ మధ్య మరింతగా బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాలపై భేటీలో చర్చించారు. తెలంగాణలో ఇప్పటికే అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి తెలిపారు. పలు రంగాల్లో సింగపూర్ అనుభవాలను మరింతగా ఉపయోగించుకుంటామని చెప్పారు. ఐటీ, ఫార్మా, పట్టణ మౌలిక వసతులు, పర్యటకం తదితర రంగాల్లో సింగపూర్ గణనీయమైన ప్రగతి సాధించిందని... ఈ రంగాల్లో అవసరమైన సహకారం అందిస్తామని కాన్సుల్ జనరల్ ప్రతిపాదించారు.
కాలుష్యరహితంగా ఉండడమే లక్ష్యం..
ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ... ఫార్మాసిటీ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బాన జరొంగ్ కంపెనీ బృహత్ ప్రణాళిక చేస్తోందని కేటీఆర్ తెలిపారు. కాలుష్యరహితంగా ఫార్మాసిటీ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన... ఈ మేరకు సింగపూర్ లాంటి దేశాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు.
అత్యుత్తమ పారిశ్రామిక విధానం...
తెలంగాణ ఏర్పాటు తర్వాత గత ఐదేళ్లలో గణనీయమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందన్న కేటీఆర్... అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటన్న ఆయన... దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలవడమే ఇందుకు కారణమని చెప్పారు.
సింగపూర్ కంపెనీలతో ప్రత్యేక సమావేశం...
రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వివరించేందుకు సింగపూర్ కంపెనీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, మౌళిక వసతులను పరిశీలించేందుకు స్థానిక ఐటీ పార్కులు, టీహబ్ లాంటి ప్రాంతాలను సందర్శించాలని కాన్సుల్ జనరల్‌కు సూచించారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగనున్న బయో ఆసియా సదస్సులో సింగపూర్‌కు చెందిన ఫార్మా దిగ్గజాలను భాగస్వాములను చేసేందుకు కాన్సుల్ కార్యాలయం సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతల పట్ల మరింత స్పష్టత వచ్చిందన్న కాన్సుల్ జనరల్... తెలంగాణ విధానాలను ప్రశంసించారు.
ఇదీ చూడండి: చర్చిస్తున్నారు.. కానీ శబ్ధమే రావడం లేదు